భారత్, ఉగాండాలలో నకిలీ టీకాలు … డబ్ల్యూహెచ్‌ఓ 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు నకిలీలు కూడా ముంచెత్తుతున్నాయని   ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)  హెచ్చరించింది. వీటిని భారత్, ఉగండాలలో గుర్తించినట్లు వెల్లడించింది. ఆ విధంగా గుర్తిస్తే వెంటనే నాశనం చేయాలని కోరింది. 

ఈ నకిలీ టీకాలను అధీకృత టీకాల కేంద్రాల నుంచి తీసుకువెళ్లి పలువురికి ఇచ్చినట్లు తేలిందని పేర్కొంటూ  5 ఎంఎల్‌, 2 ఎంఎల్‌ వయల్స్‌ 10 డోసులు నకిలీవిగా తేలాయని తెలిపింది. నకిలీ కోవ్‌షీల్డ్ బయటపడటంతో వైద్య ఉత్పత్తుల గురించి డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది.

తమ కంపెనీ 2 ఎంఎల్‌ వయల్‌లో కోవ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం లేదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) స్పష్టం చేసింది. జాబితాలో పేర్కొన్న టీకా  నకిలీదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నిర్ధారించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

నకిలీ టీకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి ప్రధాన ముప్పు అని పేర్కొన్నది.డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ సర్వైలెన్స్ అండ్ మానిటరింగ్ సిస్టం నకిలీ టీకాలను గుర్తించింది. ఉగాండాలో దొరికిన నకిలీ కోవ్‌షీల్డ్ వయల్‌లో 5 మిల్లీలీటర్ల 10 డోసులు ఉన్నాయి.

దీనిపై బ్యాచ్ నంబర్ 4121Z040, గడువు తేదీ ఆగస్టు 10 అని వ్రాయబడింది. ఇవి కూడా నకిలీయే అని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. నకిలీ కరోనా టీకాలు గుర్తించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు, అమెరికాలో ఫైజర్-బయో ఎంటెక్ నకిలీ కరోనా టీకాల గురించి డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. అయితే కోవ్‌షీల్డ్ నకిలీ టీకాల గురించిన సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ఈ ఏడాది జూలై-ఆగస్టులోనే పొందింది.