చట్టసభలతో ప్రజాస్వామ్యం నవ్వులపాలు

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన చట్టసభల్లో తరచూ సమావేశాలకు తరచూ కలుగుతున్న అంతరాయాల కారణంగా , ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులపాలు అవుతున్నదని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. భారత పార్లమెంట్,  రాష్ట్రాల శాసన సభల్లో జరిగే సమావేశాలు అర్ధవంతంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగానూ, యువతకు ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. 

బెంగళూరులో ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కేసీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఇటీవల రాజ్యసభలో సమావేశాలకు తరచూ అంతరాయాలు కలగడం, సభ సజావుగా ముందుకు సాగకపోవడం తనకు బాధను కలిగించిందని తెలిపారు. 

అంతే కాకుండా ఇటీవల పలు రాష్ట్రాల శాసన సభల్లో జరిగిన సంఘటనలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు ఆవేదన కలిగించాయని చెప్పారు.  పార్లమెంట్ లో ఇటీవల జరిగిన సంఘటనలు దురదృష్టకరమన్న ఉపరాష్ట్రపతి, కొంత మంది సభ్యులు ప్రవర్తించిన తీరు విచారకరమని పేర్కొన్నారు. 

పార్లమెంట్ స్థాయిని దిగజార్చే విధంగా కొందరు సభ్యులు ప్రవర్తించారని, కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని, ఇదే తనకు దుఃఖాన్ని కలిగించిందని తెలిపారు. కొందరు పార్లమెంట్ సభ్యుల ప్రవర్తన సభాస్థాయికి తగిన విధంగా లేవన్న ఉపరాష్ట్రపతి, చట్టసభలు చర్చించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమేనని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును గౌరవించాలన్న ఆయన, అసమ్మతిని వ్యక్తం చేయడంలో తప్పు లేదని, నిశితంగా విమర్శించవచ్చని అదే సమయంలో ఎవరి మీద తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దకూడదని హితవు చెప్పారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మరింత సుస్థిరం చేసేందుకు  మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహనీయుల స్ఫూర్తితో నూతన ఆవిష్కరణల దిశగా యువత ముందుకు కదలాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ దిశగా వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని  ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

వాతావరణ మార్పులనుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు అంతర్జాతీయంగా తీసుకునే చర్యల్లో రానున్న కొన్ని సంవత్సరాలు అత్యంత కీలకమని, దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసే విషయంలో కర్బన ఉద్గారాలను గణనీయమైన స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నూతన ఆవిష్కరణలతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

దేశంలో క్షేత్రస్థాయిలో నూతన ఆవిష్కరణకోసం ప్రయత్నిస్తున్నవారిని గుర్తించి, ప్రోత్సహించి వారికి కావాల్సిన సహాయాన్ని అందించడం ద్వారా వారిని వాణిజ్యపరంగా బలోపేతం చేసే విషయంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నానికి ప్రైవేటు రంగం, పారిశ్రామికవేత్తలు తమవంతు సహకారం అందించాలని చెప్పారు. ఈ సందర్భంగా నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్, నీతి ఆయోగ్, అటల్ ఇన్నొవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. కొంతకాలంగా దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. 

 ప్రపంచ మేథోసంపత్తి హక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో) 2020 సంవత్సరానికి గానూ విడుదల చేసిన ‘ప్రపంచ ఆవిష్కరణల సూచీ’ (గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్)లో భారతదేశం ఉత్తమ 50 (తాజా జాబితాలో 48) దేశాల జాబితాలో చోటు దక్కించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో మరింత శ్రమించి టాప్-10 జాబితాలో నిలవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

విద్యార్థుల్లో చిన్నప్పటినుంచే సృజనాత్మకతను, నూతన ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను తెలియజేసిన ఉపరాష్ట్రపతి, ఈ దిశగా అభ్యాసన-విద్యాబోధన ప్రక్రియలో చిన్నారుల్లో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఉత్సుకతను పెంపొందించాలని పేర్కొన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఈ దిశగా ప్రయత్నిస్తున్నాయని ఆయన కొనియాడారు.

విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకునేందుకు అవసరమైన ‘ఇన్నొవేషన్ హబ్స్’ ను కళాశాలల్లో ఏర్పాటుచేయాలని సూచించారు పరిశ్రమలు కూడా ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డీ) పై మరింత పెట్టుబడి పెట్టాలని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం, తమ రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు విశేషమైన ప్రోత్సాహాన్ని అందించడాన్ని అభినందించారు. 

జనవరి 2021లో నీతి ఆయోగ్ సంస్థ విడుదల చేసిన.. ‘ఇండియా ఇన్నొవేషన్ ఇండెక్స్ -2020’లో మేజర్ స్టేట్స్ విభాగంలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం ఆనందదాయకమని తెలిపారు. ఈ దిశగా ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, ఇతర భాగస్వామ్య పక్షాలను అభినందించారు.