రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిల్‌పై సీజే హిమాకోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధును నిధులు విడుదల చేశారని పిటిషనర్ తెలిపారు.
అయితే దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందని, నిబంధనలు ఖరారు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. కాగా నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్ సైట్‌లో లేదని న్యాయవాది శశికిరణ్ తెలియజేశారు.
దీంతో జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఏజీ వివరణను నమోదు చేసిన హైకోర్టు వాసాలమర్రిలో దళిత బంధుపై విచారణను ముగించింది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్‌సైట్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

More Stories
తుమ్మిడిహెట్టి ఆనకట్టపై 1న కేంద్ర జల సంఘం భేటీ
ఎస్ఐఆర్ ప్రక్రియలో నకిలీ వివరాలు ఇస్తే జైలు శిక్ష
సృజనోత్సవ్లో స్విస్ ప్రభంజనం.. భాషా సాంస్కృతిక శాఖ సత్కారం