ఆఫ్ఘన్ మరోసారి క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుంది 

‘ఆఫ్ఘ‌నిస్థాన్ నియంత్రణ కోల్పోయింది. ఇప్పటికే ఈ తరహా ఘర్షణలను చవిచూసిన దేశం మరోసారి క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుంది. ఇది అక్కడి ప్రజలకు తీరని విషాదం’  అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆఫ్ఘ‌న్‌ ప్రయోజనాల కోసమైనా తాలిబాన్‌లు వెంటనే ఈ దాడులను నిలిపివేయాలని స్పష్టం చేశారు. 
 
బలప్రయోగం సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారితీస్తుందని, దేశాన్ని ఒంటరిని చేస్తుందని ఆయన హెచ్చ‌రించారు. అధికారం కోసం యుద్ధమార్గాన్ని అవలంబిస్తున్న‌ వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఆయన పిలుపిచ్చారు. 

అమెరికా సేనలు హఠాత్తుగా ఆఫ్ఘ‌న్‌ను వీడటంతో తాలిబాన్‌లు తమ ఉనికి చాటడం ప్రారంభించారు. కొద్దికాలంలోనే 75 శాతం మేరకు దేశం వారి వశమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరో వారంలో దేశం మొత్తాన్ని హస్తగతం చేసుకుంటామని వాళ్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే వాళ్లు కాబూల్ సమీపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో ప్రజల హక్కులు అణచివేతకు గురైనట్లు నివేదికలు వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తున్న‌ వార్తలపై గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘తాలిబాన్‌ల‌ ఆధీనంలోని ప్రాంతాల్లో మహిళలు, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని మానవ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారనే నివేదికలతో కలత చెందాను. ఈ పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. పౌరులపై దాడులకు తెగబడటం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. అది యుద్ధనేరానికి ఏ మాత్రం తీసిపోదు’ అని గుటెరస్ హెచ్చరించారు.

ఇలా ఉండగా, ఆఫ్ఘన్ అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ రాజీనాచేసి త‌నమా  కుటుంబంతో క‌లిసి దేశం విడిచి వెళ్ల‌నున్న‌ట్లు వ్యాపించిన వార్త‌ల‌కు భిన్నంగా ఘ‌నీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దేశ భ‌ద్ర‌తా ద‌ళాల‌ను పున‌రుత్తేజం చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఓ వీడియో ద్వారా సందేశం ఇచ్చిన ఘ‌నీ.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో భద్రత, ర‌క్ష‌ణ ద‌ళాల‌ను బ‌లోపేతం చేయాల‌ని, ఆ దిశ‌గా చాలా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. అస్థిర‌త‌ను ఆపేస్తామ‌ని చెప్పారు.