వుహాన్ ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై నిపుణుడి ఆందోళన 

కరోనా మహమ్మారికి పుట్టిల్లుగా చెప్పుకొంటున్న చైనా నగరం వుహాన్ లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌కు అతి చేరువగా ఉన్న ల్యాబొరేటరీలో భద్రతా ప్రమాణాల తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం లోని సభ్యుడొకరు ఎంతో ఆవేదన చెందారని డానిష్ టెలివిజన్ ఛానెల్ టివి2 విడుదల చేసిన డాక్యుమెంటరీ వెల్లడించింది.

కరోనా మహమ్మారి మూలాలను కనుక్కోడానికి ఈ ఏడాది మొదట్లో ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన నిపుణుల బృందం చైనాకు వెళ్లినప్పుడు ఇది సంభవించింది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వుహాన్ విభాగం ఎలాంటి సమర్ధత, భద్రత, నైపుణ్యంతో కరోనా వైరస్ కేసులను కట్టడి చేయగలిగిందో ఎవరికీ తెలియదని డబ్లుహెచ్‌ఒ బృందం నిపుణుడు పీటర్ బెన్ ఎంబారెక్ జనవరిలో జరిగిన సదస్సులో వివరించినట్టు టివి 2 ఫుటేజి వెల్లడించింది.

బెన్ ఎంబారెక్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులకు సంబంధించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగం నిపుణుడుగా ఉంటున్నారు. అంతేకాకుండా చైనాకు వెళ్లిన నిపుణుల బృందానికి కూడా నాయకత్వం వహించిన వారిలో ఒకరు. కానీ కొన్ని నెలల తరువాత వుహాన్ పర్యటనపై డబ్లుహెచ్‌ఒ విడుదల చేసిన నివేదికలో ల్యాబ్ నుంచి వైరస్ లీకవడం అన్నది అత్యంత అసంభవంగా పేర్కొంది.

ఘనీభవించిన సముద్ర ఉత్పత్తుల ఆహార పదార్థాల ప్యాకేజిల ద్వారా కరోనా వైరస్ వ్యాపించి ఉండవచ్చని చైనా ప్రభుత్వం సిద్ధాంతీకరించడాన్ని కూడా డబ్లుహెచ్‌ఒ విశ్వసించింది. ఇటీవల డబ్లుహెచ్‌ఒ చీఫ్ టెడ్రోస్ అథనామ్ ల్యాబ్ నుంచి కొవిడ్ లీకయిందని నిర్ధారించడం తొందరపాటే అవుతుందని కూడా వ్యాఖ్యానించారు. కొవిడ్ తొలిదినాల పరిస్థితులపై పారదర్శకంగా ఉండాలని చైనాకు తాను సూచించానని చెప్పుకొచ్చారు.

మరోవంక, క‌రోనా వైర‌స్ మూలాల‌పై మ‌రోసారి ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌న్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అభ్య‌ర్థ‌న‌ల‌ను చైనా తిర‌స్క‌రించింది. వైర‌స్ ఎక్క‌డ మొద‌లైందో తెలుసుకునేందుకు తాము శాస్త్రీయ ప్ర‌య‌త్నాల‌కే మ‌ద్ద‌తిస్తాము తప్ప రాజ‌కీయ ప్ర‌య‌త్నాల‌కు కాద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో డ‌బ్ల్యూహెచ్‌వోకు చెందిన టీమ్ చైనాలో ప‌ర్య‌టించింది. వైరస్ తొలిసారి క‌నిపించిన వుహాన్‌లో ఈ బృందం ద‌ర్యాప్తు జ‌రిపింది. అయితే చైనా స్థానిక అధికారుల‌తో క‌లిసి ఈ ద‌ర్యాప్తుకు సంబంధించిన నివేదిక‌ను డ‌బ్ల్యూహెచ్‌వో రూపొందించింది. కానీ వైర‌స్ మూలాల‌పై స్ప‌ష్ట‌మైన వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌డంలో విఫ‌ల‌మైంది.