మూడు నెలల్లో ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ తాలిబన్ల వశం!

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్ అతి త్వరలో తాలిబన్ల వశంలోకి వెళ్ళబోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనా యంత్రాంగంలోని ఓ అధికారి అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ, తాము ఊహించినదానికన్నా ముందుగానే తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

రాబోయే మూడు నెలల్లో కాబూల్ తాలిబన్ల వశమవుతుందని అమెరికా సైన్యం అంచనా వేసినట్లు తెలిపారు. ఈ అధికారి తన పేరును బయటపెట్టవద్దని కోరినట్లు ఆ మీడియా సంస్థ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ ఈశాన్య ప్రావిన్స్ బడక్షన్ రాజధాని నగరం ఫైజాబాద్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన కొద్ది సేపటికే అమెరికన్ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది.

ఇప్పటికే సుమారు 65 శాతం దేశం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్ళింది. తాలిబన్లు ఆరు రోజుల్లో ఎనిమిది ప్రొవిన్షియల్ రాజధాని నగరాలను స్వాధీనం చేసుకున్నారు. బడక్షన్ సరిహద్దుల్లో తజకిస్థాన్, పాకిస్థాన్, చైనా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్ ఈశాన్య ప్రావిన్స్ ఇటీవలి వరకు ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ తాలిబన్ల ప్రాబల్యం తక్కువగా ఉండేది. ఇప్పుడు ఫైజాబాద్ కూడా తాలిబన్ల వశమవడం ఆందోళనకరమని అమెరికా అధికారులు చెప్తున్నారు.

ఇదిలావుండగా, జో బైడెన్ వైట్ హౌస్‌లో విలేకర్లతో మాట్లాడుతూ  ఆగస్టు 31నాటికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికన్ దళాలను పూర్తిగా  ఉపసంహరించాలన్న నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశారు.  ఈ విషయంలో ఇక తదుపరి చర్చలేమీ లేవని తేల్చి చెప్పారు.  20 ఏళ్లకు పైగా సుమారు ఓ ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశామని చెప్పారు. దాదాపు 3 లక్షల మంది ఆఫ్ఘనిస్థాన్ దళాలకు శిక్షణ ఇవ్వడంతోపాటు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చామని పేర్కొన్నారు. ఆప్ఘనిస్థాన్ నేతలు కలిసిరావాలని ఆయన కోరారు. 

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికన్ దళాలను ఉపసంహరించుకుంటే, అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ఆఫ్ఘనిస్థాన్ గడ్డను ఉపయోగించుకోబోమని తాలిబన్లు అమెరికాకు హామీ ఇచ్చారు. కానీ కాల్పుల విరమణకు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకరించలేదు. 

తాలిబన్ల దూకుడుకు ప్రభుత్వం అస్థవ్యస్థమై పోతున్నదని పౌరుల నుండి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడం కోసమై,  ఆఫ్ఘన్ జాతీయ సైన్యం స్థైర్యాన్ని పెంపొందించడానికి ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాజాగా దాడి జరుగుతున్న మజార్-ఇ-షరీఫ్‌లోకు వెళ్లారు. అయితే మరో మూడు ప్రాంతాలు తాలిబన్ల స్వాధీనమైన్నట్లు వార్తలు రావడంతో పరిస్థితులు విషమిస్తున్నాయి.

దేశం ఉత్తర ప్రాంతం తాలిబాన్ వ్యతిరేక మిలీషియా గ్రూపుల  బలమైన కోట. మజార్-ఇ-షరీఫ్ పడిపోతే, తాలిబాన్ ఉత్తరాదిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లే కాగలదు. ఇలా ఉండగా, త‌మ దేశం రావ‌ణ‌కాష్టంగా మారుతుండ‌టాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్.. త‌మను ఇలా గంద‌ర‌గోళంలో వ‌దిలేయ‌కండి అని ప్ర‌పంచ నేత‌లను వేడుకుంటున్నాడు. ట్విట‌ర్ ద్వారా త‌న గోడు వెల్ల‌బోసుకున్నాడు.

ప్ర‌పంచ నేత‌లారా! మా దేశం గంద‌ర‌గోళంగా ఉంది. పిల్ల‌లు, మ‌హిళ‌లు స‌హా వేల మంది ప్ర‌తి రోజూ మృత్యువాత ప‌డుతున్నారు. ఇళ్లు, ఆస్తుల విధ్వంసం జ‌రుగుతోంది. వేలాది కుటుంబాలు చెల్లాచెదుర‌య్యాయి. మ‌మ్మ‌ల్ని ఇలా గంద‌ర‌గోళంలో వ‌దిలేయ‌కండి. ఆఫ్ఘ‌న్ల హ‌త్య‌ల‌ను, ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసాన్ని ఆపండి. మాకు శాంతి కావాలి అని ర‌షీద్ ఖాన్ ఎంతో ఆవేద‌న‌తో ట్వీట్ చేశాడు.