ధ్యానం నా జీవితాన్నే మార్చేసింది

ఒలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా నిలిచిన బ్యాడ్మింట‌న్ స్టార్‌ పీవీ సింధు త‌న జీవితంలో ధ్యానం తీసుకొచ్చిన మార్పు గురించి చెప్పింది. తాను ధ్యానం చేయ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాతే త‌న జీవితం మొత్తం మారిపోయింద‌ని తెలిపింది. 

ప్ర‌తి ఒక్క‌రూ మెడిటేష‌న్ చేయాల‌ని పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని హార్ట్‌ఫుల్‌నెస్ కేంద్రానికి వెళ్లిన ఆమె అక్కడ దాజీ ఆశీస్సులు తీసుకొని, ఆయన‌తో క‌లిసి ధ్యానం చేసింది. త‌న కుటుంబం మొత్తం ధ్యానం చేస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా సింధు చెప్పింది.

“వాళ్ల ద్వారానే నేను హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేష‌న్ కేంద్రానికి వ‌చ్చాను. ఈ క‌న్హ శాంతివ‌న‌మే కాదు ఏ హార్ట్‌ఫుల్‌నెస్ కేంద్రానికి వెళ్లినా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మెడిటేష‌న్ ప్రారంభించిన త‌ర్వాతే నా జీవితం మారిపోయింది” అని ఆమె పేర్కొన్నారు. 

మెడిటేష‌న్ గురించి విన్న‌ప్పుడు చాలా మంది ఎన్నో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతారు. దీనిద్వారానే విజ‌యం వ‌స్తుందా అనీ అడుగుతారు. అయితే ధ్యానం ఓ మంత్ర‌దండం కాదు. కానీ ఇది మీ మెద‌డు, హృద‌యంలో ఓ స్ప‌ష్ట‌త‌నిస్తుందని ఆమె స్పష్టం చేసింది. 

“నా భావోద్వేగాలను స‌రిగా అర్థం చేసుకోవ‌డంలో నాకు సాయ‌ప‌డింది. నేనేం చేయాల‌న్న స్ప‌ష్ట‌త నాకు ఇచ్చింది. ఒత్తిడిలో ఉన్న స‌మ‌యాల్లో ధ్యానం ఎంత‌గానో ఉప‌క‌రించింది” అని సింధు చెప్పింది.