కరీంనగర్ గ్రానైట్ కంపెనీలపై సిబిఐ కొరడా!

కరీంనగర్ జిల్లాలో అక్రమాలకు పాల్పడిన పలు గ్రానైట్ కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకు సిబిఐ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సదరు కంపెనీల అవినీతి భాగోతాలపై ఆరా తీసే పనిలో నిమగ్నమైంది. ఈ పరిణామం ప్రస్తుతం జిల్లాలోని గ్రానైట్ సంస్థల యజమానుల గుండెల్లో రైళ్ళు పెరుగెత్తిస్తున్నాయి. 

ఎప్పుడు ఇడి విచారణకు రమ్మంటుందో, ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తుందోనన్న భయంతో వణికిపోతున్నారు. దీనికి తోడు సిబిఐ కూడా రంగంలోకి దిగనుందన్న ప్రచారం సాగుతుండడంతో గ్రానైట్ సంస్థ యజమానులకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. జిల్లాలోని తొ మ్మిది గ్రానైట్ కంపెనీలు కలిసి మొత్తంగా రూ.749 కోట్లకు పైగా పన్ను ఎగవేత వేసినట్లుగా ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) చేసిన దర్యాప్తుల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఆయా కంపెనీలకు ఇడి నోటీసులను సైతం ఇటీవల జారీ చేసింది.

పది రోజులుగా తగు సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో ఇడి స్పష్టం చేసింది. అయితే గ్రానైట్ సం స్థల నుంచి తగు సమాధానం రానిపక్షంలో నేరుగా సిబిఐ అధికారులు సైతం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు జిల్లా లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జిల్లాకు చెందిన బిజెపి పెద్దలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ కంపెనీల్లో జి ల్లాకు సంబంధించిన మంత్రి బంధువులకు చెందిన సంస్థ (శ్వేత ఏజెన్సీ) కూడా ఉంది. ఇదే ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మంత్రి అండ చూసుకుని సదరు గ్రానైట్ సంస్థ పెద్దఎత్తున అవినీతి, అక్రమాలతో పాటు భారీగా పన్నును ఎగవేత వేసింది. ఇదే అంశాన్ని బిజెపి నేతలు నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు సిబిఐ, ఇడి కార్యాలయాలకు కూడా పూర్తి ఆధారలతో సహా ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదుల ఆదారంగా చేసుకుని రంగంలోకి దిగిన ఇడి ఇటీవల జిల్లాలోని శ్వేత గ్రానైట్ కంపెనీతో పాటు మరో ఎనిమిది సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వాటిల్లో ఎఎస్ షిప్పింగ్, జెఎం బాక్సీ, మైథిలి ఆదిత్య ట్రాన్స్‌పోర్టు, కెవికె ఎనర్జీ, అరవింద్ గ్రానైట్, శాండియా ఎజెన్సీస్, పిఎస్‌ఆర్ ఎజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్ వంటి గ్రానైట్ సంస్థలు కూడా ఉన్నాయి. 

ఈ సంస్థలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశాయి. ఇందుకు సంబంధించిన సీనరేజీ చార్జీలను ఎగవేశాయి. దీనిపై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కేంద్రానికి 2019 జూలైలో ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై విచారించే క్రమంలో ఇడి కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై,  వైజాగ్ పోర్టుల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

ఈ సందర్భంగా పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లుగా గుర్తించింది. సీనరేజీ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని ఇడి సదరు కంపెనీలపై కేసు నమోదు చేసింది. అప్పట్లో రాయల్టీ ఫీజును రూ.125 కోట్లుగా నిర్ణయించగా, వాటిని కూడా చెల్లించకపోవడంతో ఇడిఐదు రెట్ల అపరాధ రుసుం విధించింది.