విదేశీ జాతీయులకు కూడా ఇకపై కరోనా టీకా

దేశంలో ఉంటున్న విదేశీ జాతీయులు ఇకపై కరోనా వ్యాక్సిన్‌ పొందవచ్చు. కరోనా టీకాకు వారు కూడా అర్హులేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని మిగతా లబ్ధిదారుల మాదిరిగా విదేశీయులు కూడా కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకుని వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపింది.

గుర్తింపు ధ్రువీకరణగా వారి పాస్‌పోర్ట్‌ను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. ‘కోవిడ్ -19 నుండి భద్రతను నిర్ధారించే చొరవలో ఇది ఒక మైలురాయి. భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు కోవిడ్ -19 టీకా తీసుకోవడానికి కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

విదేశీయులు కోవిన్ పోర్టల్‌లో నమోదు కోసం వారి పాస్‌పోర్ట్‌ను గుర్తింపు పత్రంగా ఉపయోగించవచ్చు. కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత వారు టీకా కోసం స్లాట్ పొందుతారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  తెలిపింది.

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ‘మనం కలిసి పోరాడదాం, కరోనాపై కలిసి గెలుద్దాం. దీని కోసం చేతులు కలుపుదాం. ఇప్పుడు భారత్‌లో నివసిస్తున్న విదేశీ పౌరులు కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది’ అని వెల్లడించింది. 

ఇది వైరస్ వ్యాప్తి నుంచి భద్రతను నిర్ధారిస్తుందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  మరోవైపు దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 50 కోట్లకుపైగా జనాభా వ్యాక్సిన్‌ పొందారు.