బిజెపి కార్యకర్త భార్యపై అత్యాచారం…. టిఎంసి నేతల అరెస్ట్ 

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వికృత దారిలోకి వెళ్తున్నాయి. బీజేపీకి చెందిన ఓ కార్యకర్త భార్యపై ఐదుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచారంపై  పాల్పడ్డారు. భర్త ఇంట్లోలేని సమయంలో చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి ఈ అకృత్యానికి పాల్పడ్డారు. హౌరా జిల్లాలోని అమతాలో శనివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్ నేతలే కావడం గమనార్హం. అదే పార్టీకి చెందిన మిగిలిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ ఘటనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. “ఒక మహిళ ఈ ప్రాంతంలో ఉన్న సమయంలో అత్యాచారం చేయగలిగితే, మహిళలు ఎలా సురక్షితంగా  ఉండగలరు?” అని ఆయన ప్రశ్నించారు. హౌరా జిల్లాలోని అమతాలో నివసించే బీజేపీ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు అకృత్యానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితమే బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మాట కోల్పోయిన ఆ మహిళపై సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. 

ఇంట్లో అతడు లేని సమయం చూసి శనివారం రాత్రి ఐదుగురు దుర్మార్గులు చొరబడి ఆమె కాళ్లు చేతులు కట్టేశారు. ఆమె మాట్లాడలేకపోవడంతో సాయం కోసం కేకలు కూడా వేయలేని నిస్సహాయతలో ఉండిపోయింది. అటువంటి స్థితిలో ఉన్న ఆమెపై కర్కశంగా ఐదుగురు కలిసి అత్యాచారానికి ఒడిగట్టి, పారిపోయారు.

తెల్లారాక ఆ మహిళ బిడ్డ ఆ గదిలోకి వెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి ఉండడం చూసి భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాడు. దీంతో ఇరుగుపొరుగు జనాలు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ అకృత్యానికి పాల్పడిన వాళ్లెవరో తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని చెప్పారు.

బీజేపీ కార్యకర్త భార్యపై జరిగిన రేప్‌ ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరిలో ఒక నిందితుడు బగ్నాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ యువజన నాయకుడు కాగా, రెండో నిందితుడు ఆ ఏరియా అధ్యక్షుడు. మిగిలిన ముగ్గురు కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లేనని బాధిత మహిళ భర్త ఆరోపిస్తున్నాడు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారం కోసం నియోజకవర్గంలో ఉంటున్న ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న నందిగ్రామ్‌లోని టెంటుల్ బారీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సభ్యులు ఈ ఘోరమైన నేరానికి పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. సామూహిక అత్యాచారం కేసులో మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేయడానికి బగ్నాన్ పోలీసులు మొదట్లో నిరాకరించారు. తరువాత, స్థానిక బిజెపి నాయకులు జోక్యం చేసుకోవడంతో ఉలుబేరియా లేడీస్ పోలీస్ స్టేషన్‌లో దుర్మార్గులపై కేసు నమోదు చేశారు.

ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత ఆగ్రహంతో ఉన్న టీఎంసీ గూండాలపై అత్యాచారం, హత్య, దాడి, బెదిరింపులకు సంబంధించిన డజన్ల కొద్దీ ఫిర్యాదులు వెలుగులోకి రావడం ఇక్కడ గమనార్హం.

ఎన్నికల తర్వాత టిఎంసి గూండాలు మహిళలపై ‘కక్షసాధింపు’ గా అత్యాచారం చేసిన అనేక సంఘటనలను జాతీయ మానవహక్కుల కమీషన్ కలకత్తా హైకోర్టుకు సమర్పించిన తన నివేదికలో ప్రస్తావించింది. బిజెపి కార్యకర్తలు, మద్దతుదారులు అధికార పార్టీ గూండాల నుండి విపరీతమైన వేధింపులు, హింసను ఎదుర్కొంటున్నారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సి నివేదిక ప్రకారం రాష్ట్ర పోలీసులు, అనేక కేసులలో, ఫిర్యాదులను పట్టించుకోలేదు లేదా బాధితులను మరింత బాధపెట్టడానికి నేరస్తులతో కలిసి పని చేశారని వెల్లడి అవుతున్నది.