చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. భారత్‌కు తొలి స్వర్ణం

నీర‌జ్ చోప్రా చ‌రిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఇండియాకు తొలి స్వర్ణ పతాకంను అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా సూప‌ర్ షో క‌న‌బ‌రిచి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్య‌ధికంగా 87.58 మీట‌ర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. అథ్లెటిక్స్‌లో నీర‌జ్ బంగారు ప‌త‌కాన్ని అందించి భారత్ కు చిరస్మ‌ర‌ణీయ రోజును మిగిల్చాడు.

ఒలింపిక్స్‌లో 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం లభించింది. 2008 ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రాకు షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం రాగా, ఈసారి నీరజ్ చోెప్రా పసిడి పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.

తొలి ప్ర‌య‌త్నంలో అత‌ను 87.03 మీట‌ర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. ఇక రెండో అటెంప్ట్‌లో అత‌ను మ‌రింత ప‌దునుగా త్రో చేశాడు. సెకండ్ అటెంప్ట్‌లో 87.58 మీట‌ర్ల దూరం విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరాడు. నిజానికి క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో ఫ‌స్ట్ త్రోతోనే అంద‌రికీ షాకిచ్చాడు నీర‌జ్‌. అత‌ని ప‌ర్స‌న‌ల్ బెస్ట్ 88.07 మీట‌ర్లు. దానికి త‌గిన‌ట్లే నీర‌జ్ టోక్యోలో త‌న ట్యాలెంట్ చూపించాడు. ముందు నుంచి ఫెవ‌రేట్‌గా ఉన్న నీర‌జ్‌.. అనుకున్న‌ట్లే భారత్ కు ఓ స్వ‌ర్ణాన్ని అందించాడు.

ప్ర‌తి అటెంప్ట్‌లోనూ నీర‌జ్ నిప్పులు చెరిగే రీతిలో జావెలిన్ త్రో చేశాడు. ప్ర‌తి త్రోలోనూ అత‌ను మ‌రింత మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. ఆరంభం నుంచి లీడింగ్‌లో ఉన్న చోప్రా.. ఇండియాకు అథ్లెటిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని అందించాడు. మూడ‌వ త్రోలో నీర‌జ్ కేవ‌లం 76.79 మీట‌ర్ల దూరం మాత్ర‌మే జావెలిన్‌ను విసిరాడు. తొలి మూడు రౌండ్ల‌లో లీడింగ్‌లో ఉన్న నీర‌జ్‌.. నాలుగ‌వ, అయిదో రౌండ్‌లో ఫౌల్ చేశాడు. రెండ‌వ, మూడ‌వ స్థానాల్లో చెక్ రిప‌బ్లిక్ ప్లేయ‌ర్లు నిలిచారు.

హర్యానాకు చెందిన నీరజ్‌ చోప్రా పానిపట్‌ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్‌ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్‌ చిన్న వయసులోనే ఇండియన్‌ ఆర్మీకి సెలక్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్‌ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు.

నీర‌జ్ 2016లో ఐఏఏఎఫ్ అండ‌ర్‌-20 ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో టైటిల్ గెలిచిన తొలి ఇండియ‌న్‌గా నిలిచాడు. అప్పుడే భారత్ కు అథ్లెటిక్స్‌లో ఓ బంగారం దొరికాడు. ఆ బంగార‌మే ఇప్పుడు టోక్యోలో మ‌రింత మెరిసింది. 2016లో ఆ విజ‌యం త‌ర్వాత నీర‌జ్ మ‌ళ్లీ వెనుదిరిగి చూసింది లేదు.
 
 2017లో ఏషియ‌న్ చాంపియ‌న్‌షిప్స్‌, 2018 కామ‌న్వెల్త్ గేమ్స్‌, ఆ త‌ర్వాత ఏషియ‌న్ గేమ్స్‌లో గోల్డ్ మెడ‌ల్స్ సాధించాడు. 2019లో భుజం గాయంతో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌కు దూర‌మ‌య్యాడు. గ‌తేడాది పూర్తి ఫిట్‌నెస్‌తో బ‌రిలోకి దిగిన నీర‌జ్‌.. ఏసీఎన్‌డ‌బ్ల్యూ లీగ్ మీట్‌లో 87.86 మీట‌ర్ల దూరం విసిరి.. ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు.

ఈ ఏడాది భారత్ లో రెండు దేశవాళీ టోర్నీలు గెలిచాడు. ఫెడ‌రేష‌న్ క‌ప్, ఇండియ‌న్ గ్రాండ్ ప్రి 3ల‌లో విజేత‌గా నిలిచాడు. ఈ ఇండియ‌న్ గ్రాండ్ ప్రి 3లోనే త‌న వ్య‌క్తిగ‌త బెస్ట్ 88.07 మీట‌ర్ల దూరం విసిరాడు. ప్ర‌స్తుతం ఇదే నేష‌న‌ల్ రికార్డు కావ‌డం విశేషం.

2018 ఏషియన్‌ గేమ్స్‌లో జావెలిన్‌ త్రో  ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్‌ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.

నీరజ్ పతకంతో కోట్లాదిమంది భారతీయుల హృదయాలు ఉప్పొంగిపోయాయి. 1900 సంవత్సరంలో నోర్మన్ ప్రిచర్డ్ ట్రాక్‌లో రెండు రజత పతకాలు గెలుచుకున్నాడు. అయితే, అది బ్రిటిష్ ఇండియా కాలం నాటి మాట. స్వతంత్ర భారతావనిలో మాత్రం ఇదే తొలిసారి. దిగ్గజ అథ్లెట్ అయిన మిల్కా సింగ్, పీటీ ఉష 1960, 1984లో దగ్గరగా వచ్చినప్పటికీ నాలుగో స్థానంతో నిలిచి నిరాశ పరిచారు.