టిటిడి నిధులకు మరింతగా గండి…. దేవాదాయ చట్టం సవరణ

ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను యధేచ్చంగా వినియోగించుకొంటున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరింతగా కైవసం చేసేందుకు ఏకంగా దేవాదాయ చట్టం సవరణకు సంకల్పించింది. ఆలయాల అభివృద్ధికి, అర్చక సంక్షేమానికి టీటీడీ ఏటా జరిపే నిధుల కేటాయింపులను ఇప్పటికే పెంచేసిన ప్రభుత్వం తాజాగా మరింత పెంచే దిశగా నిర్ణయిం తీసుకుంది. శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంతో టీటీడీ ఖజానాకు గండి పడనుంది. 

ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రెలిజియస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ యాక్ట్‌ 1987 చట్టాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపింది. దాని ప్రకారం రాష్ట్రంలో వివిధ రకాల ఆలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి టీటీడీ నుంచీ ఏటా గ్రాంట్ల రూపంలో జరిగే చెల్లింపులను మరింత పెంచింది. 

సర్వశ్రేయోనిధిగా పిలిచే కామన్‌గుడ్‌ ఫండ్‌కు చట్టబద్ధంగా టీటీడీ ఏటా స్వల్ప మొత్తలంలో నిధులు కేటాయించాలి. అలాగే దేవదాయ శాఖ పరిపాలనా నిధికి, అర్చక సంక్షేమ నిధికి కూడా స్వలంగా నిధులు కేటాయించాలి.  వాస్తవానికి 2020-21 బడ్జెట్‌లో టీటీడీ కామన్‌ గుడ్‌ ఫండ్‌కు రూ. 1.25 కోట్లు, ఎండోమెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫండ్‌కు రూ. 50 లక్షలు, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌కు రూ. 50 లక్షలు వంతున గ్రాంట్లు కేటాయించింది.

అయితే ప్రభుత్వ ఆదేశాలతో ఆ మొత్తాలు ప్రస్తుత 2021-22 బడ్జెట్‌లో భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుత బడ్జెట్‌లో కామన్‌ గుడ్‌ఫండ్‌కు రూ. 15 కోట్లు, ఎండోమెంట్‌ ఫండ్‌కు రూ. 10 కోట్లు, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌కు ఏకంగా రూ. 25 కోట్లు చొప్పున కేటాయింపులు జరిగాయి. అసలే కరోనా ప్రభావంతో టీటీడీకి ఆదాయ వనరులన్నీ తగ్గిపోయిన తరుణంలో ఈ కేటాయింపులే టీటీడీపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. అలాంటిది తాజాగా రాష్ట్ర మంత్రివర్గం ఈ గ్రాంట్లను మరింతగా పెంచేందుకు దేవదాయ చట్టాన్ని సవరించడం గమనార్హం.