తెలుగు రాష్ట్రాల్లో 2031 తర్వాతే కొత్తనియోజకవర్గాలు!

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం స్పష్టతనిచ్చింది. 2026 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగంలోని 170 ఆర్టికల్‌ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేసింది. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 2031 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తేల్చి చెప్పింది.

ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై మల్కాజిగిరి ఎంపి రేవంత్‌ రెడ్డి లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రారు బదులిచ్చారు.రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని సమాధానమిచ్చారు.

ఎపి విభజన ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సి ఉంది. అలాగే, ఎపిలో కూడా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225కు పెరుగుతాయి.