తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైంలో కేసు 

తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తీన్మార్‌ మల్లన్న నేతృత్వంలో నడుస్తున్న క్యూ న్యూస్‌ చానల్‌లో తన వ్యక్తిగత ఫొటోలను చూపించి పరువుకు భంగం కల్గించారంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచార చట్టం 67, ఐపీసీ 506, 509, 417 సెక్షన్ల కింద ఈ నెల 2న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు మంగళవారం రాత్రి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న క్యూ న్యూస్‌ కార్యాలయంలో సైబర్‌క్రైం పోలీస్‌  బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో క్యూ న్యూస్‌ ఉద్యోగులతో పాటు మరికొందరు బాధితుల వివరాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధిత యువతి ఫిర్యాదు ప్రకారం‘క్యూ న్యూస్‌ చానల్‌లో ఆమె  జనవరి 2020 నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు రిపోర్టర్‌గా పనిచేసింది.  ఆ సమయంలో తీన్మార్‌ మల్లన్న విధానాలు, ట్రిక్కులు నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసింది. తీన్మార్‌ మల్లన్న సోదరుడు వెంకటేశ్‌ (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌), మరికొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల సహాయంతో కొన్ని అక్రమ అప్లికేషన్స్‌ను రూపొందించి వాటి ద్వారా చాలా మంది వ్యక్తిగత సమాచారాన్ని, క్యూ న్యూస్‌ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాడు.
దాని ఆధారంగా చాలా మందిపై బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ నెల 1న ఉదయం క్యూ న్యూస్‌ చానల్‌లో మార్నింగ్‌ లైవ్‌షోలో ఆమెతో పాటు మరికొందరి అమ్మాయిల ఫొటోలను చూపుతూ,  అదే చానల్‌లో బ్యూరో చీఫ్‌గా పనిచేసిన  చిలుక ప్రవీణ్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు చూపించాడు. చిలుక ప్రవీణ్‌తో ఉన్న గొడవల కారణంగా అతడిని బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు తన ఫొటోలు వాడుకున్నాట్లు ఆమె ఆరోపించారు.
యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో ఆ వీడియోలను చూపుతూ ‘లాడ్జ్‌ వ్యవహారం’అని వ్యాఖ్యానించాడు. తీన్మార్‌ మల్లన్న చర్యల కారణంగా తన కుటుంబానికి ఉన్న విశ్వసనీయత, గౌరవానికి భంగం కలిగిన్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాను చిలుక ప్రవీణ్‌ కొలీగ్స్‌, ఫ్రెండ్స్‌ అని, ఇద్దరం ఫ్రెండ్లీగా కలిసి దిగిన ఫొటోను తీన్మార్‌ మల్లన్న ఏదో ఇల్లీగల్‌ ఇష్యూలా చిత్రీకరించి తప్పుదోవ పట్టించాలనుకున్నాడని బాధితురాలు తెలిపింది.
దర్యాప్తులో భాగంగా చిలుక ప్రవీణ్‌ను విచారించగా, మల్లన్న తన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, తన వ్యక్తిగత ఫొటోలు విడుదల చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని, ఇప్పటికే కొన్ని ఫొటోలు సోమవారం నాటి లైవ్‌ కార్యక్రమంలో విడుదల చేసినట్టు చెప్పాడని పోలీసులు తెలిపారు.