టిటిడి చైర్మన్ పదవికి సుబ్బారెడ్డి విముఖత, రంగంలో భూమన!

ప్రతిష్ఠాకరమైన తిరుమల తిరుపతి దేవస్థానములు (టిటిడి) ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వరుసగా రెండో సారి నియమించి రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్  మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి అయిన సీనియర్ వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి ఇప్పటి వరకు పదవీ బాధ్యతలు చేపట్టలేదు.

ముఖ్యమంత్రిని కలసి ఆ విషయం ఆయన స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది. 2019 ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ అయిన తనను కాదని టిడిపి నుండి వచ్చిన మాగంటి శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు లోక్ సభ స్థానం ఇచ్చిన్నప్పటి నుండి ఆయన రాజకీయంగా కీలక పాత్ర పోషింపలేక పోతున్నట్లు అసహనంగా ఉంటున్నారు. ఆ సమయంలో  రాజ్యసభ సీట్ ఇస్తానని జగన్ చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదు.

టిటిడి చైర్మన్ గా జూన్ లో రెండు సంవత్సరాల పదవీకాలం ముగియనున్న సమయంలోనే తనను ఎమ్యెల్సీ గా చేసి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవడం గాని లేదా వచ్చే ఏడాది మొదట్లో జరిగే రాజ్యసభ ఎన్నికలలో పార్టీ సీట్ ఇవ్వడం గాని చేయమని ముఖ్యమంత్రికి మనసులో మాట చెప్పారు.

అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే మరో సమీప బంధువైన ఒంగోలు ఎమ్యెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి తొలగించవలసి ఉంటుంది. రాజ్యసభకు పంపితే పార్టీ పార్లమెంటరీ నేతగా ఉంటున్న విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిపోతుంది. అందుకనే జగన్ ఇరకాటంలో ప్రస్తుతానికి టిటిడి పదవిలోనే కొనసాగమని కోరినట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి. టిటిడి ఛైర్మన్‌గా తాను ఎన్నో అవమానాలు పొందానని.. తిరిగి తనను ఆ పోస్టులో నియమించినా.. మళ్లీ అవే అవమానాలు ఎదురవుతాయని సుబ్బారెడ్డి సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తున్నది. దానితో ఇప్పుడు మరొకరిని టిటిడి చైర్మన్ గా నియమించవలసి వస్తున్నది. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్యెల్యే భూమన కరుణాకర రెడ్డిని ఆ పదవిలో నియమించవచ్చనే ఊహాగానాలు జరుగుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగారు. టిటిడి వ్యవహారాలపై ఆయనకు మంచి పట్టు ఉంది.

అయితే తిరుమలలో ఆధిపత్యం వహిస్తున్న ఒక ఉన్నత అధికారి ఆయన నియమానికి అడ్డుపడుతున్నట్లు చెబుతున్నారు.  ఈ విషయమై గతవారం తన కుమారుడు అభినయ్ రెడ్డితో కలసి కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. మునిసిపల్ కార్పొరేటర్ అయన ఆయన కుమారుడిని మునిసిపల్ వైస్ చైర్మన్ గా కూడా చేశారు.

వైఎస్ కుటుంభంకు వీర విధేయుడిగా పేరొందిన ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నా కొన్ని సమీకరణాల కారణంగా జగన్ ఇవ్వలేక పోతున్నారు. అందుకనే ఈ పదవిని ఆయనకే కట్టబెట్టవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.