రెండు హాకీ జట్లు సెమిస్ కెడతాయని ముందే ఊహించా 

తొలిసారిగా సెమీస్‌లోని దూసుకెళ్లిన మహిళల హాకీ జట్టు బృందానికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు అభినందనలు తెలిపారు. సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రత్యర్ధి జట్టు ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో భారత జట్టు విజయం సాధించి సెమీస్‌కు వెళ్లింది. కాగా, పురుషుల హాకీ టీం కూడా ఆదివారం సెమీస్‌కు వెళ్లింది. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన

మాజీ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ మాట్లాడుతూ….’ ఇది భారత్‌కు గొప్ప రోజు. హాకీలో మహిళల, పురుషుల జట్లు రెండూ సెమీస్‌కు చేరుకున్నాయి. ఇది పెద్ద విజయం. ఈ రెండు టీంలు బెంగళూరులో ఉన్నప్పుడు… వారిని కలిసేందుకు వెళ్లాను. వారితో మాట్లాడినప్పుడు… రెండు టీంలు సెమీస్‌కు వెళతాయని ఊహించా” అని వెల్లడించారు.

‘ఇంకా రెండు దశలు మిగిలే ఉన్నాయి. అయినప్పటికీ సెమీ ఫైనల్స్‌ చేరుకోవడం గొప్ప విజయమ’ని పేర్కొన్నారు. 41 సంవత్సరాల తర్వాత పురుషుల హాకీ టీం సెమీస్‌కు చేరుకుందని, ముందు మరింత క్లిష్ట దశలున్నాయని చెప్పుకొచ్చారు. అయితే సెమీస్‌ చేరుకోవడం పెద్ద విషయమేనని, సంబరాలు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

కాగా, క్వార్టర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల హాకీ టీమ్ అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌ర్చింద‌ని భార‌త్‌లో ఆస్ట్రేలియా రాయ‌బారి బ్యారీ ఓ ఫారెల్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంసించారు. భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టును అభినందిస్తూ ఆయ‌న ఒక ట్వీట్ కూడా చేశారు.

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఆట చివ‌రి వ‌ర‌కు భార‌త్ డిఫెన్స్ చెక్కుచెద‌ర‌లేద‌ని, అదే ఆ జ‌ట్టు పై చేయి సాధించ‌డానికి కార‌ణ‌మైంద‌ని బ్యారీ ఫారెల్ ట్వీట్ చేశారు. స‌వితా పూనియా భార‌త డిఫెన్స్‌లో గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాలా నిలించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌లో కూడా భార‌త్ విజ‌యం సాధించాల‌ని ఫారెల్ ఆకాంక్షించారు.