పార్లమెంట్ లో సింధుకు ప్రశంసలు… ప్రధానితో ఐస్‌క్రీమ్‌

టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధును పార్లమెంట్‌ ఉభయసభలు అభినందించాయి. సోమవారం సభ మొదలైన వెంటనే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సింధు విజయాన్ని ప్రస్తావించారు. ‘టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్యం సాధించడం ఆనందంగా వుందని, ఆమెకు ఇది వరుసగా రెండో ఒలింపిక్‌ పతకం అని… వరుసగా రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలు కావడం విశేషం అంటూ యువతకు ఆమె స్ఫూర్తి అని స్పీకర్‌ కొనియాడారు.

తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా పివి సింధు చరిత్ర సృష్టించారని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో సింధు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని, వరుసగా రెండు ఒలింపిక్స్‌లో మెడల్స్‌ సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారని వెంకయ్య అభినందించారు.

కాగా, బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు సోమ‌వారం వ‌ర్చువ‌ల్‌గా కోచ్ పార్క్‌తో క‌లిసి మీడియాతో మాట్లాడుతూ దేశం త‌ర‌ఫున ఒలింపిక్స్ మెడ‌ల్ గెల‌వ‌డ‌మే గ‌ర్వ‌కార‌ణ‌మంటే అందులోనూ వ‌రుస‌గా రెండో మెడ‌ల్ గెల‌వ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. “బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌లో చివ‌రి పాయింట్ సాధించిన త‌ర్వాత కొద్దిసేపు నా మెద‌డు ప‌ని చేయ‌లేదు. ఐదు, ఆరు సెక‌న్ల వ‌ర‌కూ అంతా బ్లాంక్‌గా ఉంది. ఆ త‌ర్వాత విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నాను” అంటూ పేర్కొన్నారు.

“సెమీఫైన‌ల్ త‌ర్వాత చాలా బాధ‌ప‌డ్డాను. ఏడ్చేశాను. అయితే కోచ్‌, ఫిజియో బాగా ఎంక‌రేజ్ చేశారు. ఇంత‌టితో అయిపోలేద‌ని, మ‌రో అవ‌కాశం ఉన్న‌ద‌ని చెబుతూ ప్రోత్స‌హించారు. బ్రాంజ్ గెల‌వ‌డానికి, నాలుగోస్థానంలో రావ‌డానికి చాలా తేడా ఉన్న‌ద‌ని కోచ్ పార్క్ చెప్పాడు. ఆ మాట‌లు నాకు ఎంత‌గానో ఉప‌క‌రించాయి “అని సింధు చెప్పింది.

ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ప్ర‌ధాని మోదీతో ఆమె మాట్లాడింది. ఈ సంద‌ర్భంగా మెడ‌ల్‌తో తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఇద్ద‌రం క‌లిసి ఐస్‌క్రీమ్‌ తిందామ‌ని మోదీ చెప్పారు. మ‌రి ఆయ‌న‌తో క‌లిసి ఏ ఫ్లేవ‌ర్ ఐస్‌క్రీమ్ తింటార‌ని ప్ర‌శ్నించ‌గా.. ఏ ఐస్‌క్రీమ్ తింటానో నాకు తెలియ‌దు కానీ.. క‌చ్చితంగా తింటాను అని ఆమె చెప్పింది. సెమీస్ త‌ర్వాత అస‌లు బాధ‌ప‌డాలో, మ‌రో అవ‌కాశం ఉన్నందుకు సంతోష‌ప‌డాలో అర్థం కాని ప‌రిస్థితుల్లో తాను ఉన్న‌ట్లు సింధు తెలిపింది.