వాట్సాప్‌పై కేసు పెట్టిన రష్యా

వాట్సాప్‌పై రష్యా కన్నెర్రజేసింది. తమ దేశ పర్సనల్‌ డాటా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై వాట్సప్‌ సంస్థపై రష్యాలో కేసు నమోదైంది. వ్యక్తిగత డాటా చట్టాన్ని ఉల్లంఘించిన నేరారోపణపై ఇటీవలనే గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్‌ కంపెనీకి రష్యా కోర్టు ఒకటి 3 మిలియన్‌ రూబుళ్లను జరిమానాగా విధించింది. 

ఇదే కారణాలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌పై కూడా పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తమ దేశ వినియోగదారుల డాటాను ఇక్కడే నిలువ చేయడంలో వాట్సాప్‌ సంస్థ విఫలమైందని ఆరోపణలు వచ్చాయి. దాంతో వాట్సాప్‌ సంస్థపై రష్యా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నిషేధించిన కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు, మాస్కోలో కార్యాలయాలు తెరువడానికి విదేశీ టెక్‌ సంస్థలను బలవంతం చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో వాట్సాప్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం నమోదు చేసిన కేసులో వాట్సాప్‌ సంస్థ దాదాపు 6 మిలియన్‌ రూబుల్స్‌ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్‌ఫ్యాక్స్‌ మీడియా సంస్థ తెలిపింది. అయితే, విచారణ తేదీలను కోర్టు ఇంకా నిర్ణయించలేదని కోర్టు పత్రాలను బట్టి తెలుస్తున్నది.