ఐరాస భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్

ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఆగస్టు నెలకు భారత దేశం ఆదివారం చేపట్టింది. సముద్ర సంబంధ భద్రత, శాంతి పరిరక్షణ, కౌంటర్ టెర్రరిజంలపై ఈ నెలలో దృష్టి సారిస్తుంది. భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఫ్రాన్స్ నుంచి భారత్ చేపట్టింది.  ఐరాసలో ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి నికొలస్ డీ రివియెరా ఈ మండలికి జూలైలో నాయకత్వం వహించారు. నికొలస్‌కు ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. 

ఆగస్టు నెలకు అధ్యక్ష స్థానంలో భారత్ నిలుస్తుందని తెలిపారు. టీఎస్ తిరుమూర్తి ఓ వీడియో సందేశంలో, భారత దేశం ఉగ్రవాదంపై పోరాటంలో ముందు వరుసలో ఉందని తెలిపారు. కౌంటర్ టెర్రరిజంపై దృష్టి పెట్టడం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఆయా అంశాల‌పై ఈ నెల‌లోనే సంత‌కాల సేక‌ర‌ణ చేప‌డుతామ‌ని ప్ర‌క‌టించారు. స‌భ్య దేశాల‌తో భార‌త్ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తుంద‌ని విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ ప్ర‌క‌టించారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఐరాసలో భారత్ పర్మినెంట్ మిషన్‌కు మార్గదర్శకత్వం చేస్తున్నారని చెప్పారు. భారత దేశంలో ఫ్రాన్స్ రాయబారి ఎమ్మాన్యుయేల్ లెనైన్ ఇచ్చిన ట్వీట్‌లో, ఐరాస భద్రతా మండలి ప్రెసిడెన్సీని ఫ్రాన్స్ నుంచి భారత్ స్వీకరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

సముద్ర సంబంధ భద్రత, శాంతి పరిరక్షణ, కౌంటర్ టెర్రరిజం వంటి వ్యూహాత్మక అంశాలపై భారత దేశంతో కలిసి పని చేస్తామని పేర్కొన్నారు. చట్టాల ఆధారంగా, బహుళ అంచెల వ్యవస్థల ద్వారా ప్రస్తుతం ఎదురవుతున్న అనేక సంక్షోభాలను ఎదుర్కొంటామని తెలిపారు.  శాశ్వ‌త‌, తాత్కాలిక స‌భ్య దేశాలు అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేప‌డుతున్నాయి. 2021-22 ఏడాదికి తాత్కాలిక స‌భ్య దేశంగా భార‌త్ ఎన్నికైంది. రెండేళ్లపాటు ఈ హోదాలో  ఉంటుంది.  వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లోనూ భార‌త్ మ‌రోమారు అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నుంది.