డెల్టా వేరియంట్‌ ఘోరం కాకముందే అణచివేయండి

కరోనాకు వ్యాక్సిన్లు వచ్చేశాయి. మళ్లీ సాధారణ జీవితం ఎంతో దూరంలో లేదు అని భావిస్తున్న తరుణంలో అదే కరోనా మహమ్మారి డెల్టా వేరియంట్‌ రూపంలో ప్రపంచంపై విరుచుకుపడుతున్నది. వేగంగా వ్యాపించే గుణం, ఎక్కువ నష్టం కలిగించే విధంగా స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు చేసుకొని కొత్త అస్ర్తాలతో మానవాళిపై దాడి చేస్తున్నది. టీకాలు అందిస్తున్న ఇమ్యూనిటీని దాటుకొని శరీరానికి నష్టం కలుగజేస్తున్నది.

డెల్టా వేరియంట్‌ పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదంటూ బహిరంగంగా తమ ప్రజలకు ధైర్యం చెప్పిన అమెరికా సీడీసీ అంతర్గత నివేదికల్లో మాత్రం వైరస్‌తో ముప్పు ఎక్కువేనని ఒప్పుకొన్నది. ఇప్పటి వరకు చూసిన అన్ని వైరస్‌ల కన్నా ఇది వేగంగా వ్యాపించగలదని పేర్కొన్నది.

కరోనా డెల్టా వేరియంట్‌ మరింత ఘోరంగా మారడానికి కన్నా ముందు అణచివేయాలని మహమ్మారి ప్రపంచాన్ని హెచ్చరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. తొలుత భారత్‌లో వెలుగు చూసిన ఈ మ్యూటెంట్‌ ..అత్యంత వేగంగా ప్రసారమౌతుందని, ఇప్పటికే 132 దేశాలను తాకిందని పేర్కొంది. 

‘ డెల్టా హెచ్చరిక చేస్తోంది. ఇది వైరస్‌ అభివృద్ధి చెందుతోందని హెచ్చరిస్తోంది. కానీ మరింత ప్రమాదకరమైన వేరియంట్లు వెలుగు చూడక ముందే మనం తగిన చర్యలు తీసుకోవాలని’ డబ్ల్యూహెచ్‌ఒ అత్యవసర డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ తప్ప కరోనా నుంచి తప్పించుకునేందుకు మరో ఉపాయం లేదని పేర్కొన్నారు. 

కరోనాను అడ్డుకునేందుకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. అనేక దేశాలను కరోనా కుదిపిస్తేన్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి నియంత్రించేందుకు తొలి నుండి అమలు చేస్తున్న వాటిని కొనసాగించాలని, అవే భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం, రద్దీ ప్రాంతాల్లో జన సమూహాం ఎక్కువగా లేకుండా చూడటం వంటి చేయాలని సూచించారు. 

ఇప్పటివరకూ నాలుగు కొత్త వేరియంట్లను గుర్తించామని డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ ఉన్నంత కాలం కొత్త వేరియంట్లు పుట్టక తప్పదని పేర్కొన్నారు. డబ్ల్యుహచ్‌ఒ పరిధిలోని ఆరింటిలోని ఐదు ప్రాంతాలు గత నాలుగు వారాల్లో 80 శాతం కేసులు పెరిగాయని చెప్పారు.  

కరోనాకు పుట్టినిల్లయిన చైనా సైతం డెల్టా వేరియంట్‌ను కట్టడి చేయడానికి తంటాలు పడుతున్నది. ఆ దేశంలో వారం రోజుల్లో 200 కేసులు నమోదయ్యాయి. డెల్టా దెబ్బకు ఇండోనేషియా కకావికలమైంది. అమెరికాలో రోజూ సగటున 70వేల కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు 80 శాతం కేసులు డెల్టా రకానికి చెందినవే. థాయ్‌ల్యాండ్‌లో 60 శాతానికిపైగా ఈ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి.

జపాన్‌, ఆస్ట్రేలియా సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. డెల్టా ఉద్ధృతంగా వ్యాప్తి చెందడంపై డబ్ల్యూహెచ్‌వో అందోళన వ్యక్తం చేసింది. ‘మరిన్ని మహమ్మారులు పుట్టుకురాకముందే వైరస్‌ను అదుపు చేయాలన్న హెచ్చరిక ఇది’అని వ్యాఖ్యానించింది.