డిస్కస్‌ త్రోలో ఫైనల్ కు కమల్‌ ప్రీత్

ఇండియ‌న్ డిస్క‌స్ త్రోయ‌ర్ క‌మ‌ల్‌ప్రీత్ కౌర్ ఫైన‌ల్ చేరింది. శ‌నివారం ఉద‌యం జ‌రిగిన క్వాలిఫికేష‌న్‌లో ఆమె 64 మీట‌ర్ల దూరం విసిరి.. ఫైన‌ల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది.
 
అంతేకాదు మొత్తం గ్రూప్ ఎ, గ్రూప్ బి క్వాలిఫికేష‌న్ల‌లో క‌లిపి క‌మ‌ల్‌ప్రీత్ విసిరిందే రెండో అత్య‌ధిక దూరం కావ‌డం విశేషం.  
తొలి ప్ర‌యత్నంలో 60.59 మీట‌ర్ల దూరమే విసిరిన ఆమె.. రెండో ప్ర‌య‌త్నంలో ఏకంగా 63.97 మీట‌ర్లు, మూడో ప్ర‌య‌త్నంలో 64 మీట‌ర్ల మార్క్ అందుకుంది. 
 
ఇక ఈ ఈవెంట్‌లోనే గ్రూప్ ఎలో పార్టిసిపేట్ చేసిన మ‌రో ఇండియ‌న్ డిస్క‌స్ త్రోయ‌ర్ సీమా పూనియా 60.57 మీట‌ర్ల దూరమే విసిరి ఫైన‌ల్‌కు క్వాలిఫై కాలేక‌పోయింది. మొత్తంగా ఆమె 16వ స్థానంలో నిలిచింది.
 
మరోవంక,  వుమెన్స్ హాకీ లో ఇవాళ జ‌రిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 4-3 గోల్స్ తేడాతో భార‌త జ‌ట్టు గెలిచింది. ఓయ్ హాకీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియ‌న్ ప్లేయ‌ర్ వంద‌నా క‌టారియా హ్యాట్రిక్ గోల్స్ చేసింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ కొట్టిన తొలి భార‌త క్రీడాకారిణిగా వంద‌న రికార్డు క్రియేట్ చేసింది.
 అయితే గ్రూప్ ఏ లో భార‌త జ‌ట్టు తుది మ్యాచ్‌ను గెలిచినా.. క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం బ్రిట‌న్‌, ఐర్లాండ్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌పై ఆధార‌ప‌డి ఉంది. గ్రూప్ ఏలో ఇండియా ఆరు పాయింట్ల‌తో నాలుగ‌వ స్థానంలో నిలిచింది. నెద‌ర్లాండ్స్ 12, జ‌ర్మ‌నీ 12, బ్రిట‌న్ 6 పాయింట్ల‌తో త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి.
తొలి అర్థ‌భాగంలో రెండు జ‌ట్లు 2-2 గోల్స్‌తో స‌మంగా నిలిచాయి. అయితే రెండ‌వ అర్థ‌భాగం ఇండియ‌న్ ప్లేయ‌ర్లు దూకుడు పెంచారు. మ్యాచ్ 49వ నిమిషంలో వంద‌న క‌టారియా హ్యాట్రిక్ గోల్ కొట్టింది.