బ్యాంకు లావాదేవీలలో నేటి నుండి పలు మార్పులు 

బ్యాంకు లావాదేవీలలో ఆగష్టు 1 నుండి పలు మార్పులు అమలులోకి వస్తున్నాయి. వీటిని ఖాతాదారులు గమనించవలసి ఉంది. తద్వారా అనవసరంగా ఎక్కువగా అపరాధ రుసుములు చెల్లించకుండా ఉండవచ్చు. కొత్త నిబంధనలు, గడువు తేదీలను నిర్లక్ష్యం చేస్తే ప్రజలపై మరింత భారం పడే అవకాశముంది. 

జూన్‌లోనే ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) తన నోటిఫికేషన్‌లో ఆగస్టు 1 నుంచి ఎటిఎంల ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచినట్లు ప్రకటించింది. ఆర్‌బిఐ 9 ఏళ్ల తర్వాత ఇంటర్ చేంజ్ ఫీజును పెంచింది. ఎటిఎంల ఖర్చులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్థికేతర లావాదేవీలపై రుసుమును రూ.5 నుంచి రూ.6 కు పెంచారు.

ఈ నెల ప్రారంభంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపిపిబి) ఆగస్టు 1 నుంచి కొన్ని బ్యాంకింగ్ చార్జీల్లో మార్పులు చేసింది. డోర్ స్టెప్ బ్యాంకింగ్, ఇతర సేవలకు సంబంధించిన చార్జీల్లో మార్పులు చేయగా, ఇప్పుడు ప్రతిసారి రూ.20 ప్లస్ జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సేవలు పూర్తిగా ఉచితంగా ఉండేవి. దీంతో ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన వంటి పోస్టాఫీసు సంబంధిత పథకాల కోసం ఇంట్లో సేవలను పొందితే రూ.20 చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వచ్చే నెల నుంచి చార్జీల్లో పలు మార్పులు చేసింది. బ్యాంక్‌లో నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్‌చేంజ్, సేవింగ్ ఖాతాదారులకు చెక్ బుక్ చార్జీల నిబంధనలను మార్పు చేసినట్టు ఇటీవల ప్రకటించింది. ఈమేరకు ఆగస్టు నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆరు మెట్రో నగరాల్లోని వినియోగదారులు నెలలోపు 4 లావాదేవీలను (డిపాజిట్లు, విత్‌డ్రాలు) మాత్రమే ఉచితంగా చేయగలరు.

ఆ తర్వాత లావాదేవీలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఐదు లావాదేవీలను ఇతర ప్రదేశాలకు మినహాయింపు ఇవ్వగా, పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే బ్యాంక్ రూ.20 చార్జీ వసూలు చేస్తుంది. ఈ చార్జీ ప్రతి ఆర్థిక లావాదేవీపై ఉండనుంది. 

అదే సమయంలో ఆర్థికేతర లావాదేవీలపై రూ.8.50 వసూలు ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. అదే సమయంలో నాలుగు సార్లు డబ్బు ఉపసంహరించుకుంటే గనుక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ఫామ్స్ 15సిఎం, 15సిబిల ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో సిబిడిటి (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) మరింత సడలింపు ఇచ్చింది. గత జూలై 15 గడువు నుంచి ఆగస్టు 15 వరకు సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.