ఆర్ధిక పునరుద్దరణకు 10 శాతం జిడిపి అవసరం 

దేశీయ ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి పూర్వ స్థితికి చేరాలంటే జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 8 నుంచి 10 శాతం స్థాయికి చేరాల్సిన అవసరం ఉందని ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు. జిడిపి వేగవంతమైతేనే గతంలో ఉన్న వృద్ధి రేటు స్థాయికి చేరుకుంటామని వారు సూచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) దేశీయ జిడిపి 9.5 శాతం ఉంటుందని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) అంచనా వేసింది. 

ప్రస్తుత రేటు వద్ద భారతీయ ఆర్థిక వ్యవస్థ కరోనా పూర్వస్థాయికి చేరుకునే అవకాశముంది. కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం మాట్లాడుతూ, 10.5 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు అంతగా ఉండదని చెప్పారు. 

ఎస్‌బిఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ మాట్లాడుతూ, ప్రస్తుత రేటు వద్ద భారత్ గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని భర్తీ చేయగలదని, ఉత్పత్తిలో శాశ్వత నష్టం ఏమిటనేదే చర్చనీయాంశమని పేర్కొన్నారు. కొవిడ్ పూర్వ స్థాయికి దేశీయ ఆర్థిక వ్యవస్థ చేరుకోగలదని, సూచీలు ఇదే అంశాలు రుజువు చేస్తున్నాయని చెప్పారు. 

సుబ్రమణ్యన్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ, అనేక హై ప్రీక్వెన్సీ ఇండికేటర్లు దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థ స్థాయి ‘వి’ ఆకారంలో కోలుకుంటోందని సూచిస్తున్నాయని తెలిపా రు. వరుసగా రెండు త్రైమాసికాలు సానుకూల సంకేతాలను చూపిస్తున్నాయి. అదే సమయంలో ఏ ఇతర దేశం కూడా కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి రికవరీని చూడలేదని ఆయన వివరించారు.

2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ జిడిపి 6.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉండనుందని, ఇది 77.5 శాతం దిశగా వేగవంతం కానుందని సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. జూన్ ముగింపు నాటికి పూర్తి సంవత్సరం బడ్జెట్ అంచనాలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు రూ.2.74 లక్షల కోట్లకు (18.2 శాతానికి) చేరింది. ఈ మేరకు శుక్రవారం సిజిఎ (కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్) డేటా విడుదల చేసింది.

గతేడాది బడ్జెట్ అంచనాలో ద్రవ్యలోటు రూ.6.62 లక్షల కోట్లతో 83.2 శాతానికి చేరింది. ఏడు దశాబ్దాల్లో ఇదే అత్యంత దారుణ ద్రవ్యలోటుగా గుర్తించారు. దీనికి కారణంగా కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ ఆంక్షల వల్ల ప్రభుత్వానికి ఆదా యం వసూళ్లు గణనీయం గా పడిపోవడమే. జూన్ ముగింపు నాటికి ద్రవ్యోలోటు రూ.2.74 లక్షల కోట్లకు చేరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపిలో ద్రవ్యలోటు 6.8 శాతం(15.06 లక్షల కోట్లు)గా ప్రభుత్వం అంచనా వేస్తోంది. 202021లో ఖర్చు, ఆదాయం మధ్య అంతరం లేదా ద్రవ్య లోటు జిడిపిలో 9.3 శాతానికి చేరింది. ఫిబ్రవరి బడ్జెట్‌లో సవరించిన అంచనాల్లో ఈ ద్రవ్య లోటును 9.5 శాతానికి సవరించారు.

 కాగా,  జూన్ లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే 8.9 శాతానికి పెరిగింది. ప్రధానంగా నాచురల్ గ్యాస్, స్టీల్, బొగ్గు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి పెరిగింది. ఈమేరకు కేంద్రం గణాంకాలను వెల్లడించింది. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్ వల్ల మైనస్ 12.4 శాతం క్షీణత నమోదైంది.