అనిల్ దేశ్‌ముఖ్ తండ్రికొడుకులకు ఇడి సమన్లు

మనీలాండరింగ్ కేసు దర్యాప్తు విషయంలో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుమారుడు హృషికేశ్ దేశ్‌ముఖ్‌లకు ఇడి సమన్లు పంపించింది. దర్యాప్తులో భాగంగా తమ ఎదుట వచ్చే వారం హాజరు కావాలని ఈ సమన్లులో తెలియచేశారని అధికార వర్గాలు తెలిపాయి. 

అనిల్ దేశ్‌ముఖ్ సుప్రీంకోర్టులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చర్యల నుంచి తప్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఇడి నుంచి వీరిరువురికి తాజాగా సమన్లు పంపించారు. వచ్చే వారం హాజరు కావాలని ఆదేశించారు. 

ఇక సుప్రీంకోర్టులో దేశ్‌ముఖ్ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 3న జరుగుతుంది. అయితే ఆగస్టు రెండున సౌత్ ముంబైలోని తమ కార్యాలయానికి రావల్సి ఉంటుందని అనిల్ దేశ్‌ముఖ్‌కు ఆయన పుత్రుడికి ఇడి స్పష్టం చేసింది. 

రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు పోలీసు అధికారుల ద్వారా అనిల్ దేశ్‌ముఖ్ నెలవారి వసూళ్లకు దిగేవారని, ఈ విధంగా ఆయన రూ 100 కోట్ల వరకూ వెనకేసుకున్నారని వెలువడ్డ అభియోగాల సంబంధిత మనీలాండరింగ్ కేసుపై ఇడి ఇప్పుడు చర్చలకు దిగింది.