హోరాహోరీ పోటీలో సెమీఫైన‌ల్ చేరిన పీవీ సింధు

ఒలింపిక్స్‌లో ప‌త‌కం దిశగా మ‌రో అడుగు వేసింది బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు.  శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్‌ఫైన‌ల్ మ్యాచ్‌లో జ‌పాన్‌కు చెందిన య‌మ‌గుచిపై 21-13, 22-20 తేడాతో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది.  ప్రపంచ చాంపియన్ సింధు గత ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకుంది.

తొలి గేమ్‌లో తొలుత వెనుక‌బ‌డినా.. అద్భుతంగా పుంజుకున్న సింధు 21-13తో గెలుచుకుంది. రెండో గేమ్‌లోనూ అదే దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ఒక ద‌శ‌లో 15-9 ఆధిక్యంలోకి దూసుకెళ్లి.. ఈజీగా మ్యాచ్ గెలిచేలా క‌నిపించింది. కానీ జ‌పాన్ ప్లేయ‌ర్ య‌మ‌గుచి అనూహ్యంగా పుంజుకోవ‌డంతోపాటు సింధు ప‌దే ప‌దే అన‌వ‌స‌ర త‌ప్పిదాలు చేసింది.

దీంతో య‌మ‌గుచి ఒక ద‌శ‌లో 20-18 ఆధిక్యంలోకి వెళ్లి గేమ్ గెలిచేలా కనిపించింది. ఈ స‌మయంలో సింధు వ‌రుస‌గా నాలుగు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ హోరాహోరీగా త‌ల‌ప‌డటంతో మ్యాచ్‌లో ఎన్నో సుదీర్ఘ ర్యాలీలు అల‌రించాయి. ముఖ్యంగా రెండో గేమ్‌లో ఒక్కో పాయింట్ కోసం ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ విప‌రీతంగా శ్రమించారు. క‌ళ్లు చెదిరే స్మాష్‌, డ్రాప్ షాట్ల‌తో ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించ‌డానికి ప్ర‌య‌త్నించారు.

అయితే ఒత్తిడిలోనూ గేమ్ పాయింట్‌ను కాచుకొని మ‌రీ వ‌రుస‌గా నాలుగు పాయింట్లు సాధించిన సింధు.. మ్యాచ్ మ‌రో గేమ్‌కు వెళ్ల‌కుండా 21-13, 22-20తో వ‌రుస గేమ్స్‌లోనే ముగించేసింది. సెమీస్‌లో సింధు గెలిస్తే క‌నీసం సిల్వ‌ర్ మెడ‌ల్ ఖాయ‌మ‌వుతుంది.

సింధు సెమీస్‌లో రేపు ప్రపంచ నంబర్ వన క్రీడాకారిణి అయిన తైవాన్‌కు టై టిజు యింగ్ లేదంటే, థాయిలాండ్‌కు చెందిన ప్రపంచ నంబర్ 6 క్రీడాకారిణి రచనోక్ ఇంటానాన్‌తో కానీ తలపడుతుంది. కాగా, నిన్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ప్రపంచ నంబరు 12 క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను 41 నిమిషాల్లోనే ఓడించింది. కాగా, డెన్మార్క్‌కు చెందిన మియా ఈ ఏడాది జనవరిలో సింధును వరుస సెట్లలో ఓడించడం గమనార్హం.

మరోవంక,  ఒలింపిక్స్‌లో ఇప్ప‌టికే క్వార్ట‌ర్‌ఫైన‌ల్ చేరిన‌ ఇండియ‌న్ హాకీ టీమ్ విజ‌య పరంపర కొన‌సాగుతోంది. శుక్ర‌వారం జ‌రిగిన చివ‌రి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5-3 గోల్స్ తేడాతో జ‌పాన్‌ను చిత్తు చేసింది. ఈ విజ‌యంతో గ్రూప్ ఎలో టీమిండియా రెండో స్థానంతో లీగ్ స్టేజ్‌ను ముగించింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల‌లో నాలుగు గెలిచి, ఒక‌దాంట్లో ఓడిన భార‌త్.. 12 పాయింట్లతో ఆస్ట్రేలియా (13) త‌ర్వాతి స్థానంలో ఉంది. జ‌పాన్‌తో మ్యాచ్‌లో గుర్జంత్ సింగ్ 2, హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్‌, షంషేర్‌, నీల‌కంఠ శ‌ర్మ త‌లా ఒక గోల్ చేశారు.