పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోను సూచిస్తే రూ 15 లక్షలు

కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త ఆర్థిక సంస్థపై చురుగ్గా కసరత్తు చేస్తున్నది. మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేయనున్న అభివృద్ధి ఆర్థిక సంస్థ (డీఎఫ్‌ఐ)కు తగిన పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోను సూచించి రూ.15 లక్షల నగదు బహుమతిని గెలుచుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

పేరు, ట్యాగ్‌లైన్, లోగో ఎంట్రీలకు సంబంధించి ఒక్కో విభాగంలో విజేతకు రూ.5 లక్షలు, రెండవ బహుమతి గ్రహీతలకు రూ.3 లక్షలు, మూడవ బహుమతి విజేతలకు రూ.2 లక్షలు చొప్పున నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పేరు, ట్యాగ్‌లైన్‌, లోగో ఎంట్రీలు పంపిన ఒక్కరివే ఎంపికైతే రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశమున్నదని పేర్కొంది. 

పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్‌ఐ) ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని సూచించేవిగాను, ఆ ఆర్థిక సంస్థ ఏమి చేస్తుంది, ఏమి చేయగలదో అన్నది స్పష్టం చేసేవిగాను ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దృశ్య సంతకంలాగా, సులభంగా ఉచ్ఛరించేలా, అందరికీ గుర్తుకు వచ్చేలా ఉండాలని పేర్కొంది. పేరు, ట్యాగ్‌లైన్‌, లోగో వాటి వాటి ప్రత్యేకతను చాటినప్పటికీ ఈ మూడు కూడా డీఎఫ్‌ఐ ముఖ్య ఉద్దేశం, లక్ష్యాన్ని కలిసికట్టుగా ప్రతిబింబించేలా ఉండాలని వివరించింది.

సృజనాత్మకత, చైతన్యం, ఇతివృత్తంతో కనెక్ట్ అయ్యే థీమ్‌, ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్‌’ను జరుపుకునే సందర్భంలో భారత స్ఫూర్తిని ప్రతిబింబించే ఎంట్రీలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పోటీ కోసం ఎంట్రీలు పంపడానికి చివరి తేదీ ఆగస్ట్‌ 15 అని వెల్లడించింది.