‘శ్రీకృష్ణుడి సేవ’ కోసం సీనియర్ ఐపీఎస్ రాజీనామా 

ప్రస్తుతం ఐజీ స్థాయి పోస్టులో కొనసాగుతున్న సీనియర్  ఐపీఎస్‌ అధికారి భారతి అరోరా భగవాన్‌ ‘శ్రీకృష్ణుడి సేవ’కు అంకితమయ్యేందుకు కోసం అంటూ స్వచ్ఛందంగా పదవీ విరమణ కోరుతూ దరఖాస్తు చేసుకోవడం సంచలనం కలిగిస్తున్నది.  1998 బ్యాచ్‌కు చెందిన భారతి అరోరా ప్రస్తుతం అంబాలా రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు.
పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి దరఖాస్తు పంపిన ఆమె ‘తాను కొన్ని సంవత్సరాలుగా సేవామార్గాన్ని వదిలి.. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఆలోచిస్తున్నానని, భగవంతుని సాక్షాత్కారం పని చేస్తాను’ అని తెలిపారు.
 
‘సేవ చేయడం నా అభిరుచి, నాకు గర్వకారణం. ప్రస్తుతం నేను జీవితంలోని అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. గురునానక్‌ దేవ్‌, చైతన్య మహాప్రభు, కబీర్‌దాస్‌, తులసీద్‌, సుర్దాస్‌, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తాను’ అంటూ ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు. 

భారతీ అరోరా భర్త వికాస్‌ అరోరా సైతం ఐపీఎప్‌ అధికారి కాగా  రేవారి ఐజీ (సౌత్‌ రేంజ్‌)గా పోస్టింగ్‌ ఇచ్చారు. 2007 ఫ్రిబవరిలో సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ బాంబు దాడి ఘటనపై అప్పటి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ బృందానికి భారతి ఎస్పీ (రైల్వే) నాయకత్వం వహించారు. పానిపట్‌ సమీపంలో జరిగిన బాంబు దాడిలో 68 మంది మృతి చెందారు. 

ఆ తర్వాత 2013లో గుర్గావ్‌లో ఉమ్మడి సీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విజయవంతంగా సేవలందించినా ఆమె తీరు కాస్త వివాదాస్పదమైంది. నగరంలో ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాఫిక్‌ నిర్వహణకు తీసుకున్న చర్యలతో ప్రశంసలు అందుకున్నారు. కానీ, అత్యాచారం కేసు విషయంలో సీపీ నవదీప్‌ సింగ్‌ విర్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికించాడని, తనపై గూఢచర్యం చేశారని ఆరోపించగా వాటిని నవదీప్‌ విర్క్‌ ఖండించారు. అనంతరం ఆమె 2015లో ఆ పోస్టు నుంచి బదిలీ చేశారు. ఒకే ఏడాదిలో మూడుసార్లు బదిలీ అయ్యారు.  2016లో మొదట డీఐజీ (సంక్షేమం, శిక్షణ), తర్వాత సోనిపట్‌లోని స్పోర్ట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, 2016లో హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గో సంరక్షణ టాస్క్‌ఫోర్స్‌ మొదటి నోడల్‌ ఆఫీసర్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత గుర్గావ్‌ ఐజీ (స్టేట్‌ క్రైమ్‌బ్రాంచ్‌)గా బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుతం వీఆర్‌ఎస్‌ కోరుతూ ఆమె చేసుకున్న దరఖాస్తును హర్యానా హోంశాఖ మంత్రి అనిల్‌ విజ్ వద్దకు చేరింది. అనిల్‌ విజ్‌ 2009లో అంబాలా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసినందుకు ఆయనను అరెస్టు చేయాలని భారతి ఆదేశించారు. ప్రస్తుతం ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ ఫైల్‌ ఆయన వద్దకే చేరుకోవడం గమనార్హం.