ఓబిసిలకు 27 శాతం, ఇడబ్ల్యుఎస్‌లకు 10 శాతం మెడికల్ సీట్లు

మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అఖిల భారత కోటా (ఎఐక్యూ) స్కీమ్‌లో ఓబిసిలకు 27 శాతం, ఇడబ్ల్యుఎస్‌లకు చెందిన వారికి 10 శాతం రిజర్వేషన్‌ అమలుకు ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. 

ఈ రిజర్వేషన్లు అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌/ డెంటల్‌ (ఎంబిబిఎస్‌, ఎండి, ఎంఎస్‌, డిప్లమో, బిడిఎస్‌, ఎండిఎస్‌) కోర్సులకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం (2021-22) నుంచే ఇవి అమలులోకి వస్తాయని తెలిపింది. 

తాజా నిర్ణయం ద్వారా ఎంబిబిఎస్‌లో ప్రతి ఏడాది 1,500 మంది, పిజిలో 2,500 మంది ఓబిసి విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా ఇడబ్ల్యుఎస్‌ విభాగం విషయానికి వస్తే ఎంబిబిఎస్‌లో 550 మందికి, పిజిలో వెయ్యి మందికి అవకాశం లభిస్తుందని పేర్కొంది.

దీనికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 26న ఓ సమావేశాన్ని నిర్వహించారు, చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు సమగ్ర పరిష్కారాన్ని కనుగొనాలని సంబందిత మంత్రిత్వ శాఖలను ఆదేశించిన్నట్లు గురువారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు.

‘‘ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల కోసం ఆలిండియా కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థికపరంగా బలహీనంగా ఉన్న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మా ప్రభుత్వం మైలు రాయి వంటి నిర్ణయం తీసుకుంది’’ అని ప్రధాని వెల్లడించారు. 

బుధ‌వారం ప‌లువురు బీజేపీ ఎంపీలు, ఓబీసీ క‌మ్యూనిటీ స‌భ్యులు కూడా మోదీని క‌లిసి ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. ఈ నిర్ణ‌యం ఎంబీబీఎస్‌లోని 1500 మంది ఓబీసీలు, 550 ఈడ‌బ్యూఎస్ విద్యార్థుల‌కు.. పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చేస్తున్న 2500 మంది ఓబీసీలు, 1000 మంది ఈడ‌బ్ల్యూఎస్ విద్యార్థుల‌కు మేలు చేయ‌నుంద‌ని ఆరోగ్య శాఖ చెప్పింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఓబీసీలు ఇక నుంచి ఈ ఆలిండియా కోటా స్కీమ్ కింద ఉన్న ఈ రిజ‌ర్వేష‌న్ల‌పై ఏ రాష్ట్రంలో అయినా సీట్ల కోసం పోటీ ప‌డ‌వ‌చ్చ‌ని తెలిపింది.

ప్రతిభ కలిగిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వీలుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1986లో ఈ ఆలిండియా కోటాను ప్రవేశపెట్టారు. ఈ కోటా కింద యుజి సీట్లలో 15 శాతం, పిజి సీట్లలో 50 శాతం ఉంటాయి. 

అయితే 2007 వరకూ ఆలిండియా కోటా కింద ఎటువంటి రిజర్వేషన్లు అమలు కాలేదు. ఆ సంవత్సరం నుంచి సుప్రీంకోర్టు ఎస్‌సిలకు 15 శాతం, ఎస్‌టిలకు 7.5శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యాసంస్థల (అడ్మిషన్లలో రిజర్వేషన్లు) చట్టం అమల్లోకి వచ్చిన 2007 నుంచి ఓబిసిలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నారు. 

ఈ రిజర్వేషన్లను సప్దార్‌జంగ్‌ హాస్పిటల్‌, టేడీ హర్దింగ్‌ మెడికల్‌ కాలేజ్‌, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, తదితర సంస్థల్లో కూడా అమలు చేశారు. అయితే దీన్ని రాష్ట్ర వైద్య, డెంటల్‌ కాలేజ్‌ల్లో ఆఖిలభారత కోటాకు విస్తరించలేదు.

వైద్య విద్యలో అఖిలభారత కోటాలో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వాగతించింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారితో పాటు బలహీనవర్గాలవారు వైద్యవిద్యకు చేరువౌతారని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.