కిర్లోస్క‌ర్ కుటుంబ మధ్యవర్తిత్వంకు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ!

ప్ర‌ముఖ పారిశ్రామిక సంస్థ కిర్లోస్క‌ర్ గ్రూప్ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సుదీర్ఘ కాలం వివాదం కొన‌సాగ‌డం వారి కంపెనీకి, ప‌రిశ్ర‌మ‌కు ల‌బ్ది చేకూర‌ద‌ని సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వ్యాఖ్యానించారు. కుటుంబ స‌భ్యుల ఉమ్మ‌డి స్నేహితుల మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో వివాద ప‌రిష్కారానికి చొర‌వ చూపాల‌ని సూచించారు. 
కిర్లోస్క‌ర్ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సుదీర్ఘ కాలంగా వివాదం కొన‌సాగుతున్న‌ది. పేరొందిన వ్యాపార కుటుంబం మ‌ధ్య ఏండ్ల త‌ర‌బ‌డి వివాదం కొన‌సాగ‌డం వారికి మంచిది కాద‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేర్కొన్నారు. ఇరు ప‌క్షాలు అంగీక‌రిస్తే, మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తిని నియ‌మిస్తామ‌ని సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ సూర్య‌కాంత్ సార‌ధ్యంలోని ధ‌ర్మాస‌నం ప్ర‌తిపాదించింది.

ఈ వివాదంపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స‌వాల్ చేస్తూ కిర్లోస్క‌ర్ బ్ర‌ద‌ర్స్ లిమిటెడ్ (కేబీఎల్‌) సీఎండీ సంజ‌య్ కిర్లోస్క‌ర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను జ‌స్టిస్ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ సూర్య‌కాంత్ సార‌ధ్యంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను ఆరు వారాల‌కు వాయిదా వేసింది.

ఈ వివాదాన్ని ఆర్బిట్రేష‌న్‌కు పంపాల‌ని బాంబే హైకోర్టు గ‌త నెల 21న ఆదేశించింది. దీన్ని సంజ‌య్ కిర్లోస్క‌ర్ వ్య‌తిరేకిస్తూ, సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టారు. తాజా మ‌ధ్య‌వ‌ర్తిత్వ ప్ర‌య‌త్నాల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పుణెలోని సివిల్ కోర్టు ఆదేశం మేర‌కు డీడ్ ఫ‌ర్ ప్యామిలీ సెటిల్మెంట్ (డీఎఫ్ఎస్‌) అమ‌లు చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.