కాంగ్రెస్ బండారాన్ని బ‌య‌ట‌పెట్టండి.. ప్రధాని పిలుపు

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌ను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంద‌ని, ఆ పార్టీ నేతల నిజ స్వ‌రూపాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ప్ర‌ధాని నరేంద్ర  మోదీ బీజేపీ ఎంపీల‌కు పిలుపిచ్చారు. ఇవాళ జ‌రిగిన బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ  వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన త‌ర్వాత ఉభ‌య‌స‌భ‌ల‌ను విప‌క్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. 

ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని, వారికా కోమా నుండి బైటపడలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం పట్ల ప్రతికూలత వ్యాప్తి చేయడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా కృషి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రవర్తన దురదృష్టకరమని అంటూ మనం ఈ స్థాయి వరకు వచ్చామని వాస్తవాన్ని వారు ఆరగించుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు. 

ఇంకా ఢిల్లీ నగరంలో 20 శాతం మంది ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు టీకాలు వేయలేదని అంటూ ఇటువంటి విషయాలు వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగష్టు, సెప్టెంబర్ లలో ప్రవేశిస్తుంది నిపుణులు చెబుతున్న కరోనా మూడో వేవ్ ను క్షేత్రస్థాయిలో కట్టడి చేయడానికి ఎంపీలు సిద్ధం కావాలని ఆయన పిలుపిచ్చారు. 

కాంగ్రెస్‌తో పాటు ఇత‌ర పార్టీలు స‌భా కార్య‌క్ర‌మాల‌ను సాగ‌నివ్వ‌డం లేదు. ఈ ఘ‌ట‌న‌ల ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తిష్టంభ‌ను తొల‌గించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను కావాల‌నే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంద‌ని ప్ర‌ధాని మోదీ ధ్వజమెత్తారు.  దేశ‌వ్యాప్తంగా కోవిడ్ ప‌రిస్థితిపై చ‌ర్చించేందుకు అఖిల‌ప‌క్ష స‌మావేశానికి పిలుపునిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆ స‌మావేశాన్ని నిషేధించింది. దాంతో పాటు ఇత‌ర పార్టీల‌ను కూడా ఆ స‌మావేశానికి వెళ్ల‌కుండా చేసింది. ఈ నేప‌థ్యంలో మోదీ ఆ పార్టీపై త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. 

ప్ర‌ధాని మోదీ కొత్త మంత్రుల‌ను ప‌రిచ‌యం చేస్తున్న స‌మ‌యంలో కూడా విప‌క్ష స‌భ్యులు నినాదాల‌తో హోరెత్తించారు. కాంగ్రెస్‌తో పాటు ఇత‌ర పార్టీల అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌ను మీడియాతో పాటు ప‌బ్లిక్ ముందు బ‌య‌ట‌పెట్టాల‌ని ప్ర‌ధాని మోదీ త‌న పార్టీ ఎంపీలకు సూచించారు. పెగాస‌స్ ప్రాజెక్టు నివేదిక‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు స‌భ‌ల‌ను అడ్డుకుంటున్న విష‌యం తెలిసిందే.

మరోవంక, పార్ల‌మెంట్‌లో విప‌క్షాలు నినాదాల‌తో హోరెత్తిస్తున్నారు. లోక్‌స‌భ, రాజ్య‌స‌భ‌లో ఇవాళ ఉద‌యం భారీ స్థాయిలో విప‌క్షాలు నిర‌స‌న నినాదాలు వినిపించాయి. రాజ్య‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టారు. పెగాస‌స్ ప్రాజెక్టు నివేదిక‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. 

పార్ల‌మెంట్ చ‌ట్టాలు చేసేందుకు ఉంద‌ని, కానీ స‌భ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటున్నారని ఉపాధ్యక్షుడు ఎం వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. పార్ల‌మెంట్ దిగ‌జారిన తీరు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న చెప్పారు. అయినా విప‌క్ష స‌భ్యులు ప‌ట్టువీడ‌క‌పోవ‌డంతో స‌భ‌ను ఆయ‌న 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. సోమవారంనాడు కూడా రాజ్యసభ ఐదుసార్లు విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వాయిదా పడింది.

ఇక లోక్‌స‌భ‌లో కూడా విప‌క్ష స‌భ్యులు నినాదాల‌తో కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్నారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. నినాదాలు తీవ్ర స్థాయికి చేర‌డంతో.. స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను వాయిదా వేశారు.సోమవారంనాడు కూడా లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడింది.