హోమ్ మంత్రి సుచరితకు హోదా తప్పా అధికారం లేదా! 

రాజకీయంగా చైతన్యం గల జిల్లాల్లో గుంటూరు జిల్లా ఒకటి. అటువంటి జిల్లాలో గత ఎన్నికలలో ప్రజలు వైసీపీకి బ్రహ్మరధం పట్టారు.  వైసిపి అధికారంలోకి రావడంలో దళిత్ వర్గాల మద్దతు కీలకమని చెప్పవచ్చు. అందుకని పదవులలో ఆ వర్గంకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. 
 
ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన హోమ్ మంత్రిత్వ శాఖను గుంటూరు జిల్లాకు చెందిన దళిత్ ఎమ్యెల్యే మేకతోటి సుచరితకు ఇచ్చారు. పైగా ఆ జిల్లాకు చెందిన ఏకైక మంత్రి ఆమె. దళిత్ వర్గాలకు హోదాలో గాని, అధికారాలు ఏమీ దక్కడం లేదని దళిత్ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఆమె మాటను పోలీస్ అధికారులు ఎవ్వరు ఖాతరు చేయడం లేదని, కనీసం ఒక సిఐని కూడా ఆమె పోస్ట్ చేసుకోలేక పోతున్నారని మాల మహానాడు నేతలు వాపోతున్నారు. 
 
ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి `సూపర్ హోమ్ మంత్రి’ వలే వ్యవహరిస్తూ, పెత్తనం చేస్తున్నట్లు ఈ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందుకనే ఈ మధ్య ఆయన గుంటూరు పర్యటనకు వస్తే, ఆమె దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. 
 
గుంటూరు నుండి ఈ మధ్య ఎమ్యెల్సీగా నామినేట్ అయినా లేళ్ళ అప్పిరెడ్డి కూడా `సూపర్ మంత్రి’ వలే వ్యవహరిస్తూ, అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ మధ్య ఆయనకు జరిగిన సన్మాన సభలో జిల్లా మంత్రియైన సుచరిత ఫోటో లేకపోవడం పట్ల దళిత్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 
 
కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలువలేని సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డదారిలో హోంమంత్రి అధికారాలను ఎంజాయ్‌ చేయడమేంటని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేయడంతో జిల్లాలో సలహాదారుతీరుపై దళిత సంఘాల్లో చర్చ మొదలైందని చెబుతున్నారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మి దళిత సంఘాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేస్తే పదవులు ఇచ్చామని చెప్పుకుంటోందని పెత్తనమంతా వారి చేతుల్లోనే పెట్టుకుంటోందని మాల సంఘాలు విమర్శిస్తున్నాయి. దళితులపై జరుగుతున్న దాడులపై ఖండనలు, అత్యాచారాలపై పరామర్శల కోసం  కూడా పార్టీ అనుమతి కోసం హోమ్ మంత్రి వేచిచూడాల్సిరావడం వైసీపీ హయంలోని తమ దుస్థితిని తెలియజేస్తోందని ఎస్సీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.