31 న భారత్‌-చైనా మధ్య 12వ రౌండ్‌ చర్చలు

31 న భారత్‌-చైనా మధ్య 12వ రౌండ్‌ చర్చలు

భారతదేశం-చైనా మధ్య 12 వ రౌండ్ చర్చలు ఈ నెల 31 న జరుగనున్నాయి. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరుగనున్న ఈ సమావేశంలో గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై చర్చించనున్నారు.

వస్తావ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) పై కొనసాగుతున్న ఉద్రిక్తతను అంతం చేయడానికి భారతదేశం-చైనా సైనిక అధికారుల 12 వ రౌండ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 26 న సమావేశం నిర్వహణకు అంగీకరించిన చైనా.. కార్గిల్ విజయ్ దివాస్ కారణంగా సమావేశాన్ని వేరే రోజున నిర్వహించాలన్న భారత్‌ విజ్ఞప్తికి చైనా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

దాంతో ఈనెల 31 న ఇరుదేశాల మధ్య కార్ప్స్‌ కమాండర్‌ స్థాయిలో చర్చలు జరుగనున్నాయి. సరిహద్దులోని గోగ్రా, హాట్ స్ప్రింగ్, డెస్పాంగ్‌లోని 900 కిలోమీటర్ల ప్రాంతంలో ఉద్రిక్తతను తగ్గించడంపై భారతదేశం దృష్టి పెట్టింది. గతేడాది ఇక్కడ పరిస్థితులను పునరుద్ధరించాలని భారత్ కోరుకుంటుండగా చైనా దీనికి సిద్ధంగా లేదు.

గోగ్రా, హాట్ స్ప్రింగ్‌లోని అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత్ కోరుకుంటున్నది. డెప్సాంగ్‌పై ఏకాభిప్రాయానికి రావడానికి సమయం పడుతుందని భారత్‌ భావిస్తున్నది. తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్‌లోని చార్డింగ్ నాలా ప్రాంతంలోని భారతీయ ప్రాంతాలలో ఇప్పటికే చాలా గుడారాలు ఏర్పాటు చేశారు.

చైనా పౌరులు కూడా ఇక్కడ నివసిస్తున్నారని, చాలాసార్లు చెప్పినప్పటికీ వారు ఖాళీ చేయడం లేరని భారత అధికారులు అంటున్నారు. భారతదేశం-చైనా మధ్య ఇప్పటివరకు 11 రౌండ్ల సమావేశాలు జరిగాయి. మునుపటి 11 సమావేశాలలో తూర్పు లడఖ్‌లోని ఉత్తర, దక్షిణ ప్యాంగాంగ్‌ సరస్సు ప్రాంతాలలో విడదీయడంపై ఒక ఒప్పందం కుదిరింది.

సైనిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతాలలో విడదీయబడిన తర్వాత రెండు దేశాల సైన్యాలు తమ శాశ్వత పోస్టులకు చేరుకున్నాయి. గాల్వన్‌ లోయలో హింసాత్మక ఘర్షణ అనంతరం భారతదేశం-చైనా మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఇరుదేశాల సైన్యాలు భారీ ఆయుధాలు, వేలాది మంది సైనికులతో మోహరించి తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ ప్రాంతంలో ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళానికి చెందిన ప్రమాదకరమైన కమాండోలను భారత్ మోహరించింది. ఫైటర్ జెట్‌లు చాలా రోజులుగా నిరంతరం ఎగురుతున్నాయి. భారత్ ఇప్పటికే లాజిస్టిక్స్ సహా ఇతర ముఖ్యమైన వస్తువులను సరిహద్దులకు చేరవేసింది.