వయో భారంతో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ పదవిలో పూర్తి కాలం కొనసాగుతారా అనే సందేహాలు ఇప్పుడు అమెరికాలో కలుగుతున్నాయి. ఆయన పదవి చేపట్టిన ఆరు నెలలకే ఆయన శారీరక సామర్ధ్యం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత నవంబర్‌లో అధ్యక్షుడి ఎన్నికల్లో గత అధ్యక్షుడు ట్రంప్‌పై ఘన విజయం సాధించిన ఆయన జనవరిలో పదవిని చేపట్టారు. ఆ సమయంలో ఓ విమానం ఎక్కబోతూ మెట్లపై తూలిపోయారు. చాలా కష్టపడి ఆ విమానం ఎక్కారు. ఆ సమయంలోనే ఆయన ఈ పదవిలో ఎక్కువ కాలం పనిచేయలేరనే కధనాలు వెలువడ్డాయి.
అదే సమయంలో ఆయనకు సొంత ఇలాకాలోని మంత్రుల పేర్లు కూడా మర్చిపోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక తటపటాయించడం అటువంటి వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఈ క్రమంలోనే వైట్ హౌస్ మాజీ ఫిజీషియన్ రోనీ జాక్సన్ బైడెన్ ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు బైడెన్‌కు శారీరకంగా ఫిట్‌నెస్ లేదని స్పష్టం చేశారు. ఈ మనిషి ఏదో ఇబ్బందికి గురౌతున్నారని, తనకు తెలిసి ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోవచ్చునని పేర్కొన్నారు.
లేదంటే 25వ అధికరణం ద్వారా ఆయన చేత ప్రభుత్వమే రాజీనామా చేయించొచ్చు అంటూ జాక్సన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్రంప్‌ను కాగ్నిజిటివ్ టెస్ట్ (ఆలోచనలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని చేసే పరీక్ష) చేయించుకోవాలని అడిగిన మేధావులు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.
బైడెన్ అధ్యక్ష పదవికి అన్‌ఫిట్ అని తేల్చేసిన ఆయన అధ్యక్షుడి విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అధ్యక్ష పదవి చేపట్టగానే మొదటిసారి కరోనా మహమ్మారి గురించి ప్రణాళికలను వివరిస్తూ టివిలో కనిపించినప్పుడు బిడెన్ పదే పదే దగ్గుతూ కనిపించడం అప్పుడే ఆయన ఆరోగ్యం పట్ల సందేహాలను కలిగించింది.
ప్రస్తుతం 78 ఏళ్ళ జో బిడెన్ అధ్యక్ష ఎన్నికలలో ఓడించిన డోనాల్డ్ ట్రంప్ కన్నా మూడేళ్లు పెద్ద. ఆరోగ్య పరిస్థితుల రీత్యా బిడెన్ ఎన్నికైనా క్రియాశీలకంగా పనిచేయలేరని, అధికారం అంతా ఉపదక్షురాలు కమల్ హర్రీస్ చేతిలో ఉంటుందని అంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే మద్యం, పొగత్రాగడం అలవాటు లేని బిడెన్ ఆరోగ్యకర జీవన విధానం కలిగివున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కానీ వయోభారంకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలోనే ఇప్పుడు మంచి ఆరోగ్యం ఉన్నప్పటికీ, బిడెన్ వైద్య సమస్యల నుండి విముక్తి పొందలేరని కొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆయనకు 1988 లో రెండు మెదడు అనూరిజమ్స్ ఉన్నాయని, వాటికి చికిత్స జరిగిందని గుర్తు చేశారు.
మెదడు అనూరిజం అనేది మెదడులో ఉబ్బిన రక్తనాళం, ఇది చికిత్స చేయకపోతే స్ట్రోక్‌కు దారితీస్తుంది. ఈ రెండింటిలో ఒకటి చీలిపోయింది. తరువాత ఆయనకు లోతైన సిర త్రంబోసిస్, పల్మనరీ ఎంబాలిజం ఉన్నప్పటికీ, ఇది ఆయన ఆరోగ్యానికి ప్రస్తుత ప్రమాదం లేదని ఆయన వైద్యుడు భరోసా ఇచ్చారు.
అయితే మెదడు అనూరిజమ్స్ ప్రమాదాలు వయస్సుతో పెరుగుతాయని స్పష్టం చేశారు. చాలా మంది 40 తర్వాత నిర్ధారణ అవుతారు. ఇవి 35 నుండి 60 సంవత్సరాల వయస్సు గలవారిలో ఎక్కువగా కనిపిస్తాయని పేర్కొన్నారు.
More Stories
కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయిల్ సుముఖత
కాలేజీల్లో కనిపించని 20 వేల మంది భారతీయ విద్యార్థులు!
లాస్ ఏంజెల్స్ కారుచిచ్చుతో 2025 ఆస్కార్ అవార్డులు రద్దు!