ఏలూరు మేయర్ పదవి దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. భారీ మెజార్టీతో ఏలూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లకు 47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగరవేసింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఒక్క స్థానం కూడా జనసేన, బీజేపీ గెలవలేక పోయాయి.
 
మేయర్‌ పదవిని ఈసారి జనరల్‌ మహిళకు కేటాయించారు. వైసీపీ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ను ఆ పార్టీ నిర్ణయించింది. 50 డివిజన్ నుంచి నూర్జహాన్ బేగం విజయం సాధించారు. ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో ఆమె గెలుపొందారు. మేయర్‌ అభ్యర్థిత్వాన్ని ఆశించిన వారిని సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగు రు డిప్యూటీ మేయర్లను కూడా ఆ పార్టీ ప్రకటించింది.
 
ఓట్ల లెక్కింపు మొదలైననప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకుపోయారు. ఏలూరు కార్పొరేషన్‌లో  50 డివిజన్ల ఉండగా, అందులో మూడు డివిజన్లను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 171 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
 
గత ఏడాది 2020 ఫిబ్రవరిలో ఏలూరు నగర పాలక సంస్థకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. మార్చి 11 నుంచి 13 వరకూ నామినేషన్ల ప్రక్రియ జరిగింది. అదేనెల 23వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉండగా మార్చి 14వ తేదీన కొవిడ్‌ కారణంగా ఎన్నికల కమిషన్‌ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసింది.
 
అనంతరం ఈ ఏడాది 2021 ఫిబ్రవరి 15వ తేదీన పాత ఎన్నికల నోటిఫికేషన్‌ ను కొనసాగిస్తూ మళ్లీ రీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇచ్చింది. దీని ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ రెండు మూడు తేదీల్లో జరిగింది. అనంతరం మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్నికలకు రెండు రోజులకు ముందు మార్చి 8వ తేదీన ఎన్నికలు నిలిపివేస్తూ  హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది.
 
వెంటనే ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేయగా 10వ తేదీ యథావిధిగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పు ఇస్తూ ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపివేసింది. ఎట్టకేలకు మార్చి 10న ఎన్నికలు నిర్వహించారు. అనంతరం మళ్లీ ప్రభుత్వం కౌంటింగ్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది మే 7వ తేదీన ఎన్నికల లెక్కింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొవిడ్‌ కారణంగా రెండు నెలల తర్వాత ఎన్నికల కమీషన్‌ ఈనెల 25న కౌంటింగ్‌ జరపాలని నిర్ణయించింది.