మహారాష్ట్రలో భారీ వర్షాలు.. 136 మంది మృతి

భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో ఎక్కడ చూసిన వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేనివానలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 136 మంది మృతిచెందారు. 
 
రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకు భారీ వర్షాలకు వరదలు సంభవించడం, కొండ చరియలు విరిగిపడటంతో 136 మంది మరణించారని సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వాడెట్టి తెలిపారు. ఇందులో రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన 36 మంది కూడా ఉన్నారని చెప్పారు.
 
కొంకన్‌ రీజియన్‌లోని పలు జిల్లాల్లో గత కొన్నిరోజులుగా భారీవర్షాలు నమోదవుతున్నాయి. దీంతో వేల మంది వరదల్లో చిక్కుకుపోయరని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 84 వేల మందిని పునరావాస, సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఇందులో కొల్హాపూర్‌కు చెందినవారే 40 వేల మందికిపైగా ఉన్నారని పేర్కొన్నారు. 
 
జిల్లాలో సుమారు 54 గ్రామాలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయని చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పంచ్‌గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నదని, 2019 తర్వాత ఇంతగా వరదలు సంభవించడం ఇదే మొదటిసారని చెప్పారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 33 మంది మృతదేహాలను వెలికితీశామని, మరో 52 మంది గల్లంతయ్యారని మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 32 ఇండ్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. 
శిథిలాల్లో చిక్కుకుపోయిన మిగతావారిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళాలు, పోలీసులు, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గురువారం పొద్దుపోయాక ఈ విషాదం జరిగిందని, రోడ్లన్నీ వరద ముంపునకు గురవడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని రాయ్‌గడ్‌ జిల్లా కలెక్టర్‌ నిధి చౌదరి తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
 
అటు రత్నగిరి జిల్లాలో విరిగిపడ్డ కొండచరియల కింద 10 మంది దాకా చిక్కుకుపోయినట్టు సమాచారం. కొల్లాపూర్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఒక బస్సు వరద తాకిడికి నదిలో కొట్టుకుపోయింది. పోలీసులు, అధికారులు వారిస్తున్నా వినకుండా డ్రైవర్‌ ఆ బ స్సును వంతెనపైకి నడిపించాడు. అప్పటికే.. చికోడీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే, కొద్ది క్షణాల ముందే అందులో ఉన్న 11 మందిని అధికారులు కాపాడడంతో పెనుముప్పు తప్పినట్టయింది. సతారా జిల్లాలో వర్షాల కారణంగా ఆరుగురు మరణించగా.. ముగ్గురు వరదలో గల్లంతయ్యారు.