ఆర్బీఐ నుండి త్వరలో ఓ డిజిటల్‌ కరెన్సీ

సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే దిశగా ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) కసరత్తు చేస్తోందని, దశల వారీ గా దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తోందని డిప్యూటీ గవర్నర్ టి.రవి శంకర్ వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో టోకు, రిటైల్ విభాగాల్లో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాజెక్టుగా దీనిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ నిర్వహించిన ఆన్‌లైన్ చర్చలో ఆయన మాట్లాడుతూ, అనేక దేశాలు ఇప్పటికే టోకు, రిటైల్ విభాగాల్లో ప్రత్యేక అవసరం కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను (సిబిడిసి) అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. 

డిజిటల్ రూపంలో రిజర్వు బ్యాంక్ జారీ చేసే ఈ సిబిడిసి చట్టబద్ధమైనవి. ఇది దేశీయ కరెన్సీ మాదిరిగానే ఉంటూ, ఒకరి నుంచి మరొకరికి మార్పు చేసుకునేందుకు అనువుగా ఉంటాయని తెలిపారు.  దేశీయంగా సెంట్రల్‌ బ్యాంకే ఓ డిజిటల్‌ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రైవేట్‌ వర్చువల్‌ కరెన్సీ వాడకంతో వచ్చే లాభాలను ప్రజలందరికీ చట్టబద్దంగా అందించినట్లవుతుందని చెప్పారు. 

సమీప భవిష్యత్తులోనే పైలెట్‌ ప్రాజెక్టుల్లో భాగంగా ఈ కరెన్సీని హోల్‌సేల్‌, రిటైల్‌ విభాగాల్లో ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన  తెలిపారు. ఇప్పటికే హోల్‌సేల్‌, రిటైల్‌ సెగ్మెంట్లలో పలు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు తమ డిజిటల్‌ కరెన్సీలను వాడుకలోకి తెచ్చాయని ఆయన గుర్తుచేశారు. ‘

రూపాయికి ఇచ్చిన ప్రాధాన్యత దీనికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఇతర వర్చువల్ కరెన్సీలలో కనిపించే ‘భయపెట్టే అస్థిరత‘ నుండి వినియోగదారులను కాపాడేందుకు సిబిడిసి అవసరమని శంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సిబిడిసిలను అన్వేషించడంలో నిమగ్నమై ఉన్నాయని, కొన్ని దేశాలు కూడా ఇటువంటి విధానాలలను ప్రవేశపెట్టాయని ఆయన తెలిపారు. 

ఆర్థిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ పలు విధానాలు, చట్టపరమైన అంశాలను పరిశీలించింది. దేశంలో డబ్బును డిజిటల్ రూపంలో సిబిడిసిగా ప్రవేశపెట్టాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. 

‘ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకుల మాదిరిగానే ఆర్‌బిఐ కూడా కొంతకాలంగా సిబిడిసి ప్రవేశపెట్టడం వల్ల లాభాలు, నష్టాలపై అన్వేషణ చేపట్టింది’ అని ఆయన వెల్లడించాయరు. ఆర్‌బిఐ దశలవారీగా డిజిటల్ కరెన్సీని పరిచయం చేయాలని యోచిస్తోంది. భారతదేశ బ్యాంకింగ్, ద్రవ్య వ్యవస్థలకు అంతరాయం కలగకుండా మార్గాలను అన్వేషిస్తోందని శంకర్ వివరించారు. 

ఆర్‌బిఐ చట్టం ప్రకారం, భౌతిక రూపంలో కరెన్సీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత నిబంధనలు రూపొందించారు. అందువల్ల చట్టపరమైన మార్పులు అవసరమని డిప్యూటీ గవర్నర్ అన్నారు. నాణేల చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా), సమాచార సాంకేతిక చట్టంలో కూడా సవరణలు అవసరమవుతాయని ఆయన వివరించారు.

నగదుపై ఆధారపడటం తగ్గి, లావాదేవీల వ్యయం దిగివస్తుందన్న ఆయన దీనివల్ల అటు పరిశ్రమకు ఇటు ప్రజలకు లాభం చేకూరగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.  అయితే సాంకేతికంగా ఇందుకున్న సాధ్యాసాధ్యాలను, బ్యాంకర్లు-పరిశ్రమ అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం వస్తుందని స్పష్టం చేశారు. ఎందుకంటే దీని విలువ పడిపోతే బ్యాంకింగ్‌ వ్యవస్థ మొత్తం ఒత్తిడికి గురయ్యే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నారు.