నాడు ప్రధానితో భేటీకి మమతా గైరాజర్… ఇప్పుడు ఢిల్లీకి పయనం 

మే నెలలో యాస్‌ తుఫాను సమయంలో పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రాగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ  వ్యవహారించిన తీరు సంచలనమైంది. ప్రధాని జరిపిన తుఫాన్ సమీక్షకు ఎగగొట్టి, కేవలం ఐదు నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయారు.

చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా సమీక్షలో ఉండనీయకుండా తనతో పాటు తీసుకు వెళ్లి, ఆయనపై కేంద్రం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించేటట్లు చేశారు. అయితే ఇప్పుడు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆమె ప్రధానితో సమావేశం కోసం చూస్తున్నారు. ఆయనను కలవడానికి తానే ఢిల్లీ వెలుగుతున్నట్లు ప్రకటించారు. 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంతా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఆమె బాధ్యతలు చేపట్టి రెండు నెలలకు పైగా అయినా ఇప్పటివరకు ప్రధానిని కలవలేదు. తాజాగా గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఎం మమత తన  ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో తాను ఢిల్లీ వెళ్తానని ప్రకటించారు.

‘రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్తా. ప్రధానిని కలుస్తా. దాంతోపాటు రాష్ట్రపతిని కూడా కలుస్తా’ అని తెలిపారు. దాదాపు మూడు నెలల తర్వాత మమతా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన అని, రాజకీయ పర్యటన కాదని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించేందుకు వెళ్తున్నారని స్పష్టం చేస్తున్నారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి పెగాసెస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇటీవల మమత మామిడిపండ్ల దౌత్యం కూడా నెరిపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇక పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తన పార్టీ  ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై ఆమె వారితో  చర్చించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరాటం తీవ్రం చేస్తానని ప్రకటించిన  మమత ఈ విషయమై పలువురు ప్రతిపక్ష నాయకులను కూడా కలవబోతున్నట్లు సంకేతం ఇచ్చారు.