ఆగ‌స్ట్‌-డిసెంబ‌ర్ నాటికి 135 కోట్ల వ్యాక్సిన్ డోసులు!

ఈ ఏడాది ఆగ‌స్ట్ నుంచి డిసెంబ‌ర్‌లోపు మొత్తం 135 కోట్ల క‌రోనా వైర‌స్ టీకాలు అందుబాటులో ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం లోక్‌స‌భ‌లో వెల్ల‌డించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ టీకా ల‌భ్య‌త వివ‌రాల‌పై స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. 
 
ఫైజ‌ర్ వ్యాక్సిన్ల‌ను భార‌త్‌కు ర‌ప్పించేలా అమెరిక‌న్ ఫార్మా కంపెనీతో ప్ర‌భుత్వం నేరుగా సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని వివ‌రించారు. 
దేశీ వ్యాక్సిన్ త‌యారీదారుల‌తో టీకా కొనుగోలు ఒప్పందాల్లో ఎలాంటి జాప్యం చేయ‌డం లేద‌ని, టీకా కొర‌త‌పై ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని మంత్రి భరోసా ఇచ్చారు. 
 
ఆయా కంపెనీల‌కు ఆర్డ‌ర్ల నిమిత్తం ప్ర‌భుత్వం అడ్వాన్సులు కూడా చెల్లించింద‌ని చెప్పారు. భార‌త్‌లో ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాక్సిన్‌, సీరం ఇనిస్టిట్యూట్ త‌యారీ కొవిషీల్డ్‌, ర‌ష్య‌న్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి.
 
కాగా, భార‌త ప్ర‌భుత్వానికి చెందిన నిపుణుల బృందం  అమెరికాకు చెందిన ఫైజ‌ర్ కంపెనీతో కోవిడ్ టీకాల స‌ర‌ఫ‌రా కోసం చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి అన్సూక్ మాండ‌వీయ లోక్‌స‌భ‌లో తెలిపారు. ప్ర‌ధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంల‌తో క‌నీసం 20 సార్లు మాట్లాడార‌ని, వారి సూచ‌న‌ల మేర‌కే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.
వ్యాక్సిన్ టెండ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డంలో రాష్ట్రాలు విఫ‌లం కావ‌డం వ‌ల్లే  జూలై 21వ తేదీన నూర‌శాతం జ‌నాభాకు వ్యాక్సిన్ ఇచ్చే ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌న ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు మంత్రి మాండ‌వీయ తెలిపారు.