జ‌మ్మూలో డ్రోన్ కూల్చివేత‌.. పేలుడు ప‌దార్ధాలు స్వాధీనం

జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌నాచ‌క్‌లో శుక్ర‌వారం డ్రోన్‌ను కూల్చివేశారు. ఆ డ్రోన్ నుంచి 5 కిలోల‌ పేలుడు ప‌దార్ధాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది. బుధ‌వారం కూడా స‌త్వారా ప్రాంతంలో ఓ డ్రోన్ సంచ‌రించిన‌ట్లు అనుమానాలు ఉన్నాయి. 

జ‌మ్మూ ఎయిర్‌బేస్ వ‌ద్ద అది ఆప‌రేట్ అవుతున్న‌ట్లు ఎన్ఎస్‌జీ ద‌ళాలు మోహ‌రించిన యాంటీ డ్రోన్ సిస్ట‌మ్ ప‌సిక‌ట్టింది. ఇటీవ‌ల జ‌మ్మూ ఎయిర్‌బేస్ వ‌ద్ద డ్రోన్లు సంచ‌రించిన ఘ‌ట‌న‌లు జ‌రిగిన నేప‌థ్యంలో అక్క‌డ యాంటీ డ్రోన్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు.

 కాగా, జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ సమీపంలో ఉన్న వార్పోరాలో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్‌తోపాటు పలువురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారనే సమాచారంతో గురువారం రాత్రి స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.

అ క్రమంలో టెర్రరిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.