ఇక కేంద్ర పధకాలు అన్నింటికీ  ఏపీలో ఒకే బ్యాంకు 

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు (సిఎస్‌ఎస్‌) ఇకపై ఒకే బ్యాంకు ద్వారా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఆ ఒకే బ్యాంకు’ కోసం వెదుకులాట సాగిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రయివేటు వాణిజ్య బ్యాంకులతోనూ సంప్రదింపులు సాగిస్తోంది.

కేంద్ర ప్రాయోజిత పథకాలకోసం ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. అయితే రాష్ట్రాల్లో ఈ నిధులను వేర్వేరు బ్యాంకుల్లో నిల్వ ఉంచుతూ, వాటిని తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఖర్చు చేస్తున్నాయి. కొన్ని నిధులు రాష్ట్ర పథకాలకు కూడా మళ్లింపులు జరుగుతున్నాయి. 

దానితో కేంద్రం ఇకనుండి సిఎస్‌ఎస్‌ నిధులను రాష్ట్రాలు సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ పేరిట ఒకే బ్యాంకు ద్వారా మాత్రమే నిర్వహించాలనీ, ప్రతి పథకానికీ ఒక్కో అకౌంటును ఏర్పాటు చేయాలనీ, వాటన్నిటినీ తన ఆధీనంలో ఉన్న పిఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. 

ప్రతియేటా పాతిక వేల కోట్లకు పైగానే నిధులు కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇందులో కేంద్ర వాటాగా సుమారు పది వేల కోట్లుంటాయి. ప్రతి మూడు నెలలకోసారి కేంద్రం విడుదల చేస్తే వాటికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ నిధులు కేటాయించాలి. అయితే ఆ నిధులు ఏడాదిలో మూడు, నాలుగవ త్రైమాసికాల్లోనే విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ నిధులను ఇకపై నోడల్‌ బ్యాంకుద్వారా ఖర్చు చేయాల్సివుంది. ఆ సింగిల్‌ బ్యాంకును ఖరారు చేసేందుకు అన్వేషణలో భాగంగా అన్ని వాణిజ్య బ్యాంకుల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. వాటిలో కొన్ని నిబంధనలను ప్రకటించింది. ఇందులో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఐటి వ్యవస్థ ఆధునీకరణతో ఉరడాలని, అది పిఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం కావాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే అన్ని కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులను ఒకే ఖాతాలో ఉంచేందుకు ఆ బ్యాంకు అంగీకరించాలని స్పష్టం చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు రాని నేపథ్యంలో ఆయా పథకాలను పూర్తి చేసేందుకుగాను అవసరమైన మొత్తాలను అతి తక్కువ వడ్డీకి ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పించేందుకు బ్యాంకులు అంగీకరించాలని ప్రతిపాదించారు. తరువాత ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ఓడి చెల్లింపులకు వాడుకోవచ్చునని పేర్కొన్నారు.