టీటీడీ అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వం

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కూ వంశపారంపర్య అర్చకత్వ విధానాన్ని అమలుచేయాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం నిర్ణయించింది.  తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు, ప్రస్తుత గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల రిటైర్మెంట్‌ విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది.

తిరుమలలో వంశపారంపర్య అర్చకత్వం విధానం సమర్థ అమలుకు సూచనలు ఇచ్చేందుకు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి, జ్యుడీషియల్‌ ప్రివ్యూ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొంది.

వంశపారంపర్య హక్కుల కోసం అర్చకులు సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తుండగా, టీడీపీ హయాంలో దీనిపై అధ్యయనం ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వంశపారంపర్య హక్కులు కల్పించింది. అయితే తిరుమలలో పూర్వం మిరాశీ వ్యవస్థ ఉన్నందున వారికి ఈ హక్కులు అమలు చేయలేదు. కానీ ఎన్నికలకు ముందు వయోపరిమితి దాటడంతో అప్పటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. దానితో అది రాజకీయంగా మలుపు తిరిగింది.

అప్పట్లోనే రమణ దీక్షితులకు తమ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రధాన అర్చకుల కుటుంబాల నుంచే కొత్త అర్చకులు ఆయన స్థానంలోకి రావడంతో సాంకేతికంగా ఆయన్ను ప్రధాన అర్చకుడిని చేయడం సాధ్యపడలేదు. దీంతో ఇచ్చిన మాట కోసం ఆయన్ను గౌరవ ప్రధాన అర్చకుడుగా నియమించారు.

కానీ తనకు ప్రధాన అర్చకుడి స్థానమే కావాలంటూ ఆయన డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశపారంపర్య హక్కులు అమలుచేయాలని జీవో ఇవ్వడం అంటే మళ్లీ ఆయన్ను పూర్వస్థానానికి తీసుకొచ్చే ప్రయత్నమేనని అర్చక వర్గాలు అంటున్నాయి. వంశపారంపర్య హక్కులు అమలుచేస్తే ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకులు వయసుతో సంబంధం లేకుండా.. చేయగలిగినంత కాలం అర్చకత్వం చేయొచ్చు.

అయితే ఆయా ఆలయాలను బట్టి అర్చకులకు జీతాలు ఇవ్వాలా? లేదా ఆదాయంలో వాటా ఇవ్వాలా? అనేది తెలవలసి ఉంది. తిరుమలలోనూ ఒకప్పుడు అర్చకులకు వాటా ఇచ్చే మిరాశీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు మిరాశీ వ్యవస్థ తిరిగి రాకపోయినా వయసుతో సంబంధం లేకుండా అర్చకులు చేయగలిగినంత కాలం వారి స్థానాల్లో కొనసాగే వీలు కలుగుతుంది. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల అర్చక సమాఖ్య నాయకులు హర్షం వ్యక్తంచేశారు.