కేంద్ర నిధులు వాడుకోకోలేని టీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనన్ని నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వినియోగించుకోలేకపోవడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు.
 
పీఎంజీఎస్ వై కింద తగిన నిధులు వాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి అర్హత ఉందని కేంద్ర గ్రామీణాభివ్రుద్ది శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పార్లమెంట్ సాక్షిగా చెప్పినప్పటికీ  టీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకోలేకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.

భారత దేశంలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు కనెక్టివిటీ ఉండాలనే గొప్ప ఆశయంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రం వాడుకోవడం చేతకావడం లేదని విమర్శంచారు.

2016లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి 70,674 ఇండ్లను మంజూరు చేసినప్పటికీ ఒక్క ఇంటిని కూడా నిర్మించకపోవడం క్షమించరాని విషయమని సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివ్రుద్దికి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆయా పథకాలకు కేటాయించిన నిధులు, మంజూరైన ఇండ్లు, రోడ్ల నిర్మాణాల వివరాలే నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్ధత ఎంతో పార్లమెంట్ సాక్షిగా మరోమారు తేటతెల్లమైందని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ చెబుతున్న మాటలన్నీ అబద్దాలేననే విషయం దేశ అత్యున్నత చట్టసభ వేదిక సాక్షిగా మరోమారు దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని వెల్లడించారు.