కృష్ణా ట్రైబ్యునల్‌ కాల పరిమితి ఏడాది పొడిగింపు

కృష్ణా ట్రైబ్యునల్‌ కాల పరిమితిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఏడాది పొడిగిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2004 ఏప్రిల్‌ 2న నాటి యూపీఏ ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ కోసం ఈ ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. అది ఆరేళ్లపాటు విచారణ కొనసాగించి 2010 డిసెంబర్‌ 30న నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ కర్ణాటక, మహారాష్ట్రలు చట్టంలోని సెక్షన్‌ 5(3)ని అనుసరించి 2011 మార్చి 29న మళ్లీ దరఖాస్తు చేశాయి. 

వాటిపై ఏడాదిలోపు ట్రైబ్యునల్‌ తుది నివేదికను కేంద్రానికి సమర్పించాలి. కాగా దానిపై వాదనలు ముగియకపోవడంతో కేంద్రం ఏటా ట్రిబ్యునల్‌ కాలపరిమితిని పొడిగిస్తూ వస్తున్నది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటివాటాను సైతం కృష్ణా నది ట్రిబ్యునల్‌ స్పష్టంగా తేల్చాల్సి ఉంది.

ఇలా  ఉండగా, పరీవాహక ప్రాంతం, సాగు భూమి విస్తీర్ణం, కరువు పీడిత ప్రాంతాలు ఇలా ఏ అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నా కృష్ణా నదీ జలాల్లో తమకే ఎక్కువ వాటా దక్కుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ట్రిబ్యునల్‌ ఎదుట ఇవే ప్రతిపాదనలను పెట్టామని.. అవార్డులను ప్రకటించేదాకా తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను కోరింది. 

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌  కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. ట్రిబ్యునల్‌ అవార్డుల ప్రకారం, లేకుంటే గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం మాత్రమే రెండురాష్ర్టాల మధ్య కేఆర్‌ఎంబీ నదీ జలాల పంపిణీ, వినియోగాన్ని నియంత్రించాల్సి ఉంటుందని మరోసారి గుర్తుచేశారు. 

కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70.8 శాతం ఉండగా, ఏపీలో 29.2 శాతమే ఉన్నదని వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు 771 టీఎంసీల వాటా దక్కాల్సి ఉంటుందని.. దీనిపై ఇప్పటికే ట్రిబ్యునల్‌ ఎదుట సహేతుకమైన ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు.