రాచకొండను జాతీయ వారసత్వ సంపదగా గుర్తించండి

యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండలం పరిధిలో ఉన్న రాచకొండ కోటను జాతీయ వారసత్వ సంపదగా గుర్తించి, రాచకొండ పరిదిలోని కోటలను , ప్రాచీన దేవాలయాలను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర పర్యాటక సాంసృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని రాచకొండ పరిరక్షణ సమితి కన్వీనర్ రావినూతల శశిధర్ కోరారు.
భాగ్యనగరానికి ఆనుకొని ఉన్న రాచకొండ కోటతో పాటు చుట్టూ నెలకొని ఉన్న కొండలు, లోయలు, సహజ సిద్ధమైన సరస్సులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే దేశ విదేశాల నుండి కూడా పర్యాటకులు సందర్శించే అవకాశం లభిస్తుందని కిషన్ రెడ్డిని కలిసి సమర్పించిన వినతి పత్రంలో తెలిపారు.
రాచకొండ ప్రాంతంలోని అనేక ప్రాచీన దేవాలయాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి పరిస్తే పెద్దఎత్తున భక్తులు సందర్శిస్తారని, రాచకొండ ప్రాంతంలో ఎకో- టూరిజిం, అడ్వెంచర్ టూరిజం , ట్రైబల్ టూరిజం,  విలేజ్ టూరిజం అభివృధ్ధి చేస్తే విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు మరింతమంది పర్యాటకులు వస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వీటి ఫలితంగా నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా,  హైదరాబాద్ జిల్లా పరిధిలోని స్థానిక యువతకు, గ్రామీణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.  రాచకొండ చుట్టుప్రక్కల వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని వాటిలో అంతర్జాతీయ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమాచారం తెప్పించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని ప్రతినిధి బృందానికి హామి ఇచ్చారు. కిషన్‌రెడ్డిని కలిసిన  ప్రతినిధి బృందంలో ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా డైరెక్టర్ డా. కాసం వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు.