ఓ మంత్రి హంతక ముఠాతో పాదయాత్ర భగ్నంకు యత్నం 

‘‘ఓ మంత్రి హంతక ముఠాతో చేతులు కలిపి నా పాదయాత్రను అడ్డుకుని, దాడి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. మాజీ నక్సలైట్‌ ఒకరు నాకు ఈ సమాచారం ఇచ్చాడు’’ అని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు.  అయితే హత్యా రాజకీయాలకు భయ పడనని, ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం గోపాల్‌పూర్‌ పంచాయతీ పరిధి బత్తినివానిపల్లిలో ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఉదయం పూజలు చేసిన అనంతరం ఈటల ప్రజాదీవెన పాదయాత్రను ప్రారంభించారు.  

`తెలంగాణ ఉద్యమ సమయంలో నరహంతకుడు నయీమ్‌ వంద ఫోన్లు చేసి చంపుతా అంటేనే భయపడలేదు. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసినవాడిని, ఈటల మల్లయ్య కొడుకుని. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల బిడ్డ ఈ ఈటల రాజేందర్‌. వారి ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లాడతా’ అని స్పష్టం చేశారు. 

`దుబ్బాకలో ఎం జరిగిందో అదే ఇక్కడా జరుగుతుంది. 2018లో నన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా నా ప్రజలు అండగా నిలిచారు. ఇప్పుడూ నిలుస్తారు..’ అని ఈటల భరోసా వ్యక్తం చేశారు.  హుజూరాబాద్‌కు బానిసల్లాగా వచ్చిన మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు చిల్లర చేష్టలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

రైస్‌మిల్‌లో వంటకు ఏర్పాట్లు చేసుకుంటేయజమానిని బెదిరించి సామగ్రి సీజ్‌ చేశారని, ఇలాంటివాటికి భయపడనని స్పష్టం చేశారు.  నియోజకవర్గంలో వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా నడవడం లేదని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మేధావులు, విద్యార్థులు, ప్రజలు హుజూరాబాద్‌ వైపు చూస్తున్నారని పేర్కొంటూ  కర్రు కాల్చి వాత పెట్టాలని,  ఇతర పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేయాలని ఈటెల పిలుపిచ్చారు. ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే  సీఎం కేసీఆర్‌కు దళితబంధు పథకాన్ని ప్రకటించారన్నారని ఈటల విమర్శించారు.

‘‘ఫాంహౌ్‌సలో ఉన్న సీఎం కేసీఆర్‌.. నా రాజీనామాతో ప్రజల బాట పట్టారు. హుజూరాబాద్‌ ప్రజలకు నేను గతంలో కొట్లాడి పింఛన్లు, నిధులు ఇప్పించా. ఇప్పుడు రాజీనామాతో ఇప్పిస్తున్నా’’ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపజేయాలని ఈటెల ఈటెల డిమాండ్ చేశారు.

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి జెండా ఊపి ఈటల పాదయాత్రను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుండెల్లో ఈటల రాజేందర్‌ నిద్రపోతాడని స్పష్టం చేశారు. ఈ జనాన్ని చూసి కేసీఆర్‌ ఈ రోజు నిద్రపోరని అన్నారు. గూండా నాయకుల్లారా.. దుర్మార్గానికి దిగితే మీకు రామదండు దాడి తప్పదంటూ హెచ్చరించారు. 

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ తమను రెచ్చగొడితే ఇటుకకు సమాధానం కంకర రాళ్లతో ఉంటుందని స్పష్టం చేశారు. మండలానికి ఒకరిని మర్డర్‌ చేసిన ముద్దసానిని ఢీకొట్టి గెలిచిన ఈటల ఎవరికీ భయపడ రని ధీమా వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కూడా మాట్లాడారు. బీజేపీ శ్రేణులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.   పాదయాత్ర 12 కిలోమీటర్ల మేర సాగింది. ప్రజలు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు బత్తివానిపల్లెలో ఈటలకు సతీమణి జమున విజయతిలకం దిద్దారు. 

మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, గండ్ర నళిని కూడా పాల్గొన్నారు. ఈటల పాదయాత్ర 23 రోజుల పాటు 127 గ్రామాల మీదుగా 270 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.