యువతను ఉగ్రవాదులు కాకుండా అడ్డుకున్న కాశ్మీర్ పోలీసులు 

ఉగ్రవాద సంస్థల పిలుపు మేరకు కుటుంబాలను వీడి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పలువురు యువకులను జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ అడ్డుకున్నారు. దాదాపు 14 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కశ్మీర్‌లో ఉగ్రవాద సమస్య లేకుండా చూసేందుకు జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ రేయనకా పగలనకా గస్తీ కాస్తున్నారు.
 
ఇందులో భాగంగా యువత ఉగ్రవాదం వైపు మొగ్గు చూపకుండా వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలను కూడా చూపిస్తున్నారు. అయినప్పటికీ కొందరు యువకులు వివిధ ఉగ్రవాద సంస్థల మాయమాటలను నమ్మి ఆర్థిక సాయం పొందేందుకు ఉగ్రవాదులుగా మారి శిక్షణ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి ఒక కుట్రను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు.
 
అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు జోరుగా సాగుతుండటంతో కౌంటర్‌ టెర్రరిస్ట్ పోలీసులు దృష్టిసారించారు. ముఖ్యంగా యువత ఉగ్రవాదులుగా మారకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల 14 మంది యువకులు పాకిస్తాన్‌కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందేందుకు బయల్దేరగా ఆర్మీ వారిని పట్టుకున్నది. 
 
అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించి కుటుంబాలతో కలిసేలా చేశారు. ఈ యువకులు పాకిస్తాన్ చేరుకోవడానికి సరిహద్దు దాటకముందే, ఈ విషయం ఆర్మీ, పోలీసులకు సకాలంలో తెలియడంతో వారిని దారిలో పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ యువకులకు కౌన్సెలింగ్ కొనసాగుతున్నదని పోలీసు వర్గాలు తెలిపాయి.
 
ఉగ్రవాదంలో చేరడం ద్వారా ఏరోజైనా మరణం తప్పదని, అయితే చనిపోయిన తర్వాత తమ కుటుంబాలను చూసుకోవడానికి ఎవరూ లేరనే నిజాన్ని వారు గ్రహించేలా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదం వైపు మొగ్గుచూపుతున్న వీరంతా 18 నుంచి 22 ఏండ్ల వయసు వారే కావడం విశేషం. 
 
కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఉగ్రవాద సంస్థల వైపు దృష్టిసారిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉన్న పలు ఉగ్రవాద సంస్థలు సోషల్‌ మీడియా వేదికల నుంచి ఇలాంటి యువతకు గాలం వేసి జిహదీలుగా మార్చుతున్నట్లు పోలీసులు తెలిపారు.