నీలి చిత్రాల చిత్రీకరణలో శిల్పా శెట్టి భ‌ర్త!

నీలి చిత్రాల (బ్లూ ఫిల్మ్స్‌) చిత్రీకరణ కేసులో బాలీవుడ్‌ సీనియర్‌ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఔత్సాహిక న‌టీన‌టుల‌తో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. 
 
ఫిబ్ర‌వ‌రిలో ఈ కేసును న‌మోదు చేశారు. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీల‌క సూత్ర‌ధారి అని, ఈ విష‌యంలో త‌మ వ‌ద్ద బోల‌డ‌న్ని ఆధారాలు ఉన్న‌ట్లు ముంబై పోలీసు క‌మీష‌న‌ర్ తెలిపారు. పోర్న్ ఫిల్మ్స్‌ను యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్న కేసులో రాజ్‌కుంద్రాను అరెస్టు చేశామ‌ని, ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంద‌ని క‌మిష‌న‌ర్ హేమంత్ న‌గ‌రేల్ తెలిపారు. 
 
కుంద్రాతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది మందిని అదుపులోకి తీసుకున్నారు. నీలి చిత్రాలు రూపొందించి.. వాటిని యాప్‌లలో విడుదల చేస్తుండటంపై ఫిబ్రవరిలోనే ముంబై క్రైం బ్రాంచ్‌లో ఈ కేసు నమోదైంది. అప్పట్లో ఆరోపణలను ఖండించిన రాజ్‌ కుంద్రా ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశారు. కాగా, శిల్పాతో రాజ్‌కు 2009తో వివాహమైంది. ఐపీఎల్‌లో వీరు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు యజమానులుగా ఉన్నారు. 2013లో వెలుగుచూసిన స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఢిల్లీ పోలీసులు రాజ్‌ కుంద్రాను ప్రశ్నించారు.
 
ముంబై పోలీసుశాఖ‌కు చెందిన ప్రాప‌ర్టీ సెల్.. పోర్న్ వీడియోలు చేస్తున్న‌ ఓ ముఠాను ప‌ట్టుకున్న‌ది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామ‌న్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియ‌లు తీశారు. ఈ కేసులో న‌టుడు గెహ‌నా విశిష్ట్‌ను కూడా అరెస్టు చేశారు. ముంబై పోలీసుల కధనం ప్రకారం పోర్న్ వీడియోలు షూట్ చేసిన త‌ర్వాత‌.. వాటిని వీట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా విదేశాల‌కు ఆ కామెంట్‌ను పంపిస్తారు. అయితే భార‌తీయ చ‌ట్టాల నుంచి త‌ప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాల‌ను అక్క‌డి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. 
 
కుంద్ర ఆఫీసు నుంచే వీట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా ఫైల్స్‌ను విదేశాల‌కు పంపేవాళ్లు. అయితే న‌ట‌న‌పై ఆస‌క్తి ఉండి, ఆ కెరీర్‌లో ముందుకు వెళ్దామ‌ని వ‌చ్చే యువ యాక్ట‌ర్ల‌ను పోర్న్ రాకెట్ గ్యాంగ్ వ‌ల‌వేసి ప‌ట్టుకునేది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల్లో మంచి పాత్ర‌లు క‌ల్పిస్తామ‌ని చెప్పి.. వారితో అశ్లీల చిత్రాలు తీయించేవారు. 
 
పోర్న్ రాకెట్ న‌డుపుతున్న ముఠా నిందితుడికి ఒక వీడియోతో రెండు లేదా మూడు ల‌క్ష‌లు వ‌స్తాయి. దాంట్లో బాధితుల‌కు 20 లేదా 25 వేలు ఇచ్చేవాళ్లు అని కొన్ని వ‌ర్గాల ద్వారా తెలిసింది. ముంబైలోని వెస్ట్ మ‌లాడ్‌లో ఉన్న మాద్ ఏరియా బిల్డింగ్‌లో షూటింగ్ చేసేవాళ్లు. అక్క‌డ పోలీసులు చేసిన త‌నిఖీల్లో అయిదుగురు దొరికారు.
 
ఉమేశ్ కామ‌త్ అనే నిందితుడు .. వియాన్ ఇండ‌స్ట్రీస్‌లో డైర‌క్ట‌ర్‌గా చేశారు. దాంట్లో కుంద్రా చైర్మ‌న్‌గా ఉన్నారు. పోర్న్ ఫిల్మ్స్ షూటింగ్ కేసులో.. సీ గ్రేడ్ డైర‌క్ట‌ర్‌ను సూర‌త్‌లో అరెస్టు చేశారు. అత‌న్ని త‌న్వీర్ హ‌ష్మీగా గుర్తించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను 8 అశ్లీల చిత్రాల‌ను డైర‌క్ట్ చేశాడు.