లంకపై టీమిండియా ఘన విజయం

లంకపై టీమిండియా ఘన విజయం

దీపక్ చాహర్ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టడంతో శ్రీలంకతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. ఈ గెలుపుతో మరో వన్డే మిగిలివుండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన టీమిండియా మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఏడు కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 

తొలి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన పృథ్వీషా ఈసారి నిరాశ పరిచాడు. మూడు ఫోర్లతో 13 పరుగులు చేసిన షాను హరసంగా క్లీన్‌బౌల్డ్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా విఫలమయ్యాడు. ఒక పరుగు మాత్రమే చేసి రజిత వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. 

మరోవైపు జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఆరు ఫోర్లతో 29 పరుగులు చేసి హరసంగా చేతికి చిక్కాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సూర్యకుమార్, మనీష్ పాండే తమపై వేసుకున్నారు. 

ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ధాటిగా ఆడిన పాండే మూడు ఫోర్లతో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు సూర్యకుమార్ ఆరు ఫోర్లతో 44 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. హార్దిక్(0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మరోవైపు కృనాల్ పాండ్య (35) మెరుగ్గా ఆడాడు. 

ఇక చివర్లో భువనేశ్వర్ కుమార్ 19 (నాటౌట్) అండతో దీపక్ చాహర్ భారత్‌కు గెలుపు సాధించి పెట్టాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన దీపక్ 7 ఫోర్లు, సిక్స్‌తో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

ఇక అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను అవిష్క ఫెర్నాండో (50), అసలంకా (65) ఆదుకున్నారు. చివర్లో కరుణరత్నె 44 (నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో లంక స్కోరు 275 పరుగులకు చేరింది.