పెగాస‌స్ ప్ర‌కంప‌న‌లతో ఉభ‌య‌స‌భ‌లు వాయిదా

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు ఇవాళ విప‌క్ష నినాదాల‌తో హోరెత్తాయి. పెగాస‌స్ స్పైవేర్‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్ష స‌భ్యులు డిమాండ్ చేశారు. ప్ల‌కార్డుల‌తో వెల్‌లోకి దూసుకువ‌చ్చారు. ఆ స‌మ‌యంలో స్పీక‌ర్ ఓం బిర్లా వారిని వెన‌క్కి వెళ్లాల‌ని ఆదేశించారు. ప్ర‌శ్నోత్త‌రాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు నినాదాలు ఆప‌లేదు.
 
దీంతో స్పీక‌ర్ బిర్లా.. విప‌క్ష స‌భ్యుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌రైన రీతిలో నోటీసు ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ఆ అంశంపై సోమ‌వార‌మే ప్ర‌క‌ట‌న చేసింద‌ని గుర్తు చేశారు. అయినా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నినాదాలు కొన‌సాగించారు. అన్ని అంశాల‌పై స‌మాధానం ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని స్పీక‌ర్ తెలిపారు.
 
గంద‌ర‌గోళం మ‌ధ్య స్పీక‌ర్ స‌భ‌ను మధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు. రాజ్య‌స‌భ‌లోనూ ఇదే సీన్ రిపీటైంది. విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకురావ‌డంతో  స‌భ‌ను చైర్మ‌న్ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. లోక్‌సభ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ మాట్లాడుతూ పెగాస‌స్ లాంటి ఇంటెలిజెన్స్ సిస్ట‌మ్‌ను ఎప్పుడైనా  కాంగ్రెస్ వాడిందా?. ఇలాంటి గూఢ‌చ‌ర్యం గురించి త‌మ‌కు తెలియ‌ద‌ని తెలిపారు. న్యూ ఇండియా మేకింగ్‌కు ఇదో స్ట్రాట‌జీ అని అధిర్ ఆరోపించారు.
 
అయితే ప్ర‌భుత్వానికి, పెగాస‌స్ ఇష్యూకు సంబంధం లేద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి స్పష్టం చేశారు.  ఒక‌వేళ ఆ స‌మ‌స్య‌ను వాళ్లు లేవ‌నెత్తాల‌నుకుంటే, దాన్ని స‌రైన రీతిలో ప్ర‌శ్నించాల‌ని సూచించారు. ఇప్ప‌టికే ఆ అంశంపై మంత్రి స‌మాధానం ఇచ్చిన‌ట్లు జోషీ గుర్తు చేశారు. 
 
ఇలా ఉండగా,  సభలో ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం దుమ్ము దుమారం రేపుతున్న నేపథ్యంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర  మోదీ కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.కార్యక్షేత్రంలో కాంగ్రెస్ విఫలమవుతూ వస్తోందని, అయినా వారి గురించి ఆలోచించకుండా, బీజేపీ గురించే ఎక్కువ ఆలోచిస్తుంటారని ఎద్దేవా చేశారు. 
 
అసోం, బెంగాల్, కేరళలో ఘోరంగా విఫలం చెందినా, బీజేపీపై విరుచుకుపడుతూనే ఉన్నారని మండిపడ్డారు. వారి పార్టీ గురించి ఆలోచించడం కంటే, బీజేపీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. వ్యాక్సిన్ విషయంలోనూ ప్రతిపక్షాలు ప్రతికూల ప్రచారమే చేస్తున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని మోదీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పనిగట్టుకొని దేశంలో వ్యతిరేక ప్రచారానికి ఒడిగడుతోందని మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.