అస్సాంలో జనాభా నియంత్రణ సైన్యం

ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో గర్భనిరోధక మందుల పంపిణీకి, జనాభా నియంత్రణపై అవగాహన కల్పించేందుకు జనాభా నియంత్రణ సైన్యాన్ని వినియోగించనున్నట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ బిస్వా శర్మ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 
 
వెయ్యిమంది సైనికులతో కూడిన బృందాలను దిగువ అసోం ప్రాంతాలకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ వెయ్యి మంది యువకులతో పాటు ఆశా వర్కర్లను కూడా ఈ కార్యక్రమానికి వినియోగించనున్నట్లు తెలిపారు. 
 
దిగువ అసోంలోని అధిక జనాభా కారణంగా ఇక్కడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎగువ అసోంలోని ప్రజలకు సంబంధం ఉండదని, రాష్ట్రంలో జనాభా నియంత్రణపై అవగాహన కల్పించడం ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలోని సెంట్రల్‌, పశ్చిమ ప్రాంతాల్లో ముస్లిం జనాభా అత్యధికంగా పెరిగిపోతున్నట్లు అసెంబ్లీకి తెలిపారు. 
 
రాష్ట్రంలో 2001-2011 మధ్య హిందువుల జనాభా పెరుగుదల కేవలం పది శాతం ఉండగా, ముస్లిం జనాభా పెరుగుదల 29 శాతంగా ఉందని పేర్కొన్నారు. మిత జనాభా కారణంగా హిందువుల జీవన శైలి మెరుగ్గా ఉందని, విశాలమైన నివాసాలు, వాహనాలు కలిగి ఉన్నారని చెప్పారు. అలాగే వారి సంతానంలో అధిక శాతం మంది వైద్యులు, ఇంజనీర్లుగా కొనసాగుతున్నారని తెలిపారు.